ఇవాళ ఏపీలో మోదీ సభలు.. ఏం బాంబులు పేలుస్తారో?

Chakravarthi Kalyan
ప్రధాని మోదీ ఇవాళ ఏపీకి రాబోతున్నారు. రెండు సభల్లో ఆయన ప్రసంగించనున్నారు. ఎన్డీఏ కూటమి ఇవాళ రెండు భారీ బహిరంగ సభలు నిర్వహిస్తోంది. వీటికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు. భారీ బహిరంగ సభకు కూటమి నేతలు ఇప్పటికే  ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రధానితో పవన్ కళ్యాణ్, లోకేష్ ఈ సభలో పాల్గొనున్నారు. అనకాపల్లి నియోజకవర్గంలోని కశింకోట మండలం తాళ్లపాలెం వద్ద మరో సభ నిర్వహిస్తున్నారు. ఈ సభలో ప్రధాని మోదీతో కలిసి  తెలుగుదేశం అధినేత చంద్రబాబు పాల్గొంటారు.

ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుతున్న సమయంలో ఈ మీటింగ్‌లకు  ప్రాధాన్యం చేకూరింది. గోదావరి తీరంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ  కూటమి భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది.  తెలుగుదేశం, బీజేపీ,  జనసేనలు కూటమిగా ఏర్పడిన తర్వాత తొలిసారి చిలకలూరిపేట నియోజకవర్గం బొప్పూడిలో బహిరంగ సభ నిర్వహించారు. ఆ సభలో మోదీ చంద్రబాబును ఘోరంగా డిజప్పాయింట్ చేశారు. కనీసం జగన్ పేరు కూడా ఎత్తలేదు. దీంతో టీడీపీ శ్రేణులు ఉస్సూరన్నాయి.

మరి ఇప్పుడు రెండో సభను రాజమండ్రి సమీపంలోని  వేమగిరిలో నిర్వహిస్తున్నారు. మరి ఈసారైనా మోడీ నేరుగా జగన్‌పై విమర్శలు గుప్పిస్తారో లేదో అన్నది ఆసక్తికరంగా మారింది. తెలుగుదేశం గతేడాది మహానాడు నిర్వహించిన మైదాన ప్రాంగణంలో సుమారు 50 ఎకరాల స్థలంలోనే ఈ భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ప్రధాని మోదీ సభా వేదిక వద్దకు మధ్యాహ్నం మూడు గంటలకు చేరుకుంటారని భావిస్తున్నారు.

ఈ సభకు రాజమండ్రి , కాకినాడ, అమలాపురం, ఏలూరు, నరసాపురం ప్రాంతాల నుంచి జనాన్ని సమీకరిస్తున్తనారు. ఇప్పటికే చిలకలూరిపేటలో ప్రధాని పాల్గొన్న సభలో భద్రతా లోపాలు తలెత్తాయి. నిర్వహణ అట్టర్‌ ఫ్లాప్‌గా మారింది. కనీసం మైకులు కూడా చూసుకోలేదనే విమర్శలు వచ్చాయి. అందుకే ఈసారి టీడీపీ అప్రమత్తమైంది. మూడు గంటల 45 నిమిషాలకు రాజమండ్రి సభ ముగిశాక ప్రధాని అనకాపల్లి వెళ్తారు. అనకాపల్లి నియోజకవర్గంలోని కశింకోట మండలం తాళ్లపాలెం వద్ద సభలో చంద్రబాబుతో కలసి మోదీ పాల్గొంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: