ఏపీ: సీఎం జగన్ మేనిఫెస్టో అదరహో అంటున్న మహిళా నేత.. ప్రచారం ఫలించేనా?

Suma Kallamadi
ఏపీ సీఎం, వైసీపీ అధినే జగన్ తమ పార్టీ మేనిఫెస్టోను తాజాగా విడుదల చేశారు. ఇప్పటికే ముమ్మరంగా ప్రచారం చేస్తున్న వైసీపీ నేతలు తాజాగా ఆ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. వాటిని ప్రజలకు వివరిస్తూ ఓట్లు అడుగుతున్నారు. ఇదే కోవలో విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేశినేని నాని తరుపున ఆయన కుమార్తె కేశినేని శ్వేత నగరంలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. నగరంలోని 50వ వార్డులో ఆమె వైసీపీ తరుపున ప్రచారం చేసి, తమ పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. జగన్ ప్రకటించిన మేనిఫెస్టో అందరినీ ఆకట్టుకుంటోందని, ఇది వైసీపీ అభ్యర్థుల విజయావకాశాలను మరింత పెంచుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
సీఎం జగన్ పేదల పక్షాన ఉండి గత పథకాలను కొనసాగిస్తూనే, వాటి పరిమితిని మరింత పెంచారని పేర్కొన్నారు. వైఎస్ఆర్ చేయూతను రూ.1.5 లక్షలకు పెంచారని, అమ్మ ఒడి సాయాన్ని రూ.2 వేలు పెంచి రూ.17 వేలకు చేర్చారని అన్నారు. పెన్షన్లను కూడా రూ.3,500లకు దశలవారీగా పెంచుతానని అందరికీ భరోసా ఇచ్చినట్లు గుర్తు చేశారు. కాపు మహిళలకు కాపు నేస్తం పథకాన్ని కొనసాగించనున్నట్లు చెప్పారు. ఇవన్నీ సక్సెస్‌ఫుల్ పథకాలని, వీటితో ప్రజలంతా హ్యాపీగా ఉన్నారని వివరించారు. అయితే తండ్రి తరుపున ఆమె చేసే ప్రచారం ఎంత వరకు ఫలిస్తుందో మే 13న తేలనుంది.
రాష్ట్ర ప్రజలను ఆకట్టుకునేలా వైసీపీ అధినేత, సీఎం జగన్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ప్రస్తుతం నెలకు రూ.3000 ఇస్తున్న సంక్షేమ పింఛను 2028 జనవరి నుంచి రూ.3250కి, 2029 జనవరి నుంచి రూ.3500కి పెంచుతామని జగన్‌ హామీ ఇచ్చారు. దీంతో పాటు విశాఖను ప్రభుత్వ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా మార్చనున్నారు.  ఇందులో సంక్షేమ పింఛన్ల పెంపుతో పాటు అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తామని చెప్పారు. బైబిల్, ఖురాన్, భగవద్గీత వంటి మత గ్రంథాల వలె మేనిఫెస్టోను పవిత్రంగా భావిస్తామని చెప్పారు.
అయితే జగన్ మేనిఫెస్టో అట్టర్ ఫ్లాప్ అని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జరిగిన ప్రజాగళం ఎన్నికల ప్రచార సభలో నాయుడు ఈ ప్రకటన చేశారు. సంపూర్ణ నిషేధం అమలు చేస్తామన్న హామీ ఏమైందని, మద్యం ధరలు ఎందుకు పెంచుతున్నారని ప్రశ్నించారు. ఇప్పటికే రాష్ట్రాన్ని నిండా అప్పుల్లో ముంచేశారని పేర్కొన్నారు. అన్ని వ్యవస్థలను ధ్వంసం చేశారని విమర్శించారు. ఇలాంటి వ్యక్తిని మరోసారి ఎన్నుకుంటే ఇక రాష్ట్రం అధోగతి పాలవడం ఖాయమన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: