వాసవి ఇన్‌ఫ్రా: చెరువులో అపార్ట్‌మెంట్లు కడుతోందా?

Chakravarthi Kalyan
హైదరాబాద్‌ బాచుపల్లిలోని కోమటికుంట చెరువు ఎఫ్టీఎల్‌లో వాసవి ఇన్‌ఫ్రా నిర్మాణాలు చేపడుతోందనడానికి తగిన ఆధారాలు సమర్పించాలని పిటిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వ శాఖలు దానికి సంబంధించిన ఆధారాలను సమర్పించడంలో తగిన చొరవ చూపడంలేదన్న హైకోర్టు.. పట్టా భూమిలోనే నిర్మాణం జరుగుతోందని హెచ్ఎండీయే చెబుతోందని, అందువల్ల ఎఫ్టీఎల్ జోన్‌లో నిర్మాణాలకు సంబంధించి తాజా ఆధారాలను ఫొటోలతో సహా సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.

బాచుపల్లిలో కోమటికుంట ఎఫ్టీఎల్ ప్రాంతంలో వాసవి ఇన్‌ఫ్రా ఎల్ఎల్‌పీ  నిర్మాణాలు చేపట్టినా అధికారులు చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ నిజాంపేటకు చెందిన సతీష్ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీంతోపాటు వాసవి నిర్మాణాలను నిలిపివేస్తూ హెచ్ఎండీయే ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వాసవి పిటిషన్ దాఖలు చేసింది. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాదే. జస్టిస్ జె అనిల్‌కుమార్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. అన్ని అనుమతులు తీసుకున్నాకే 12 బ్లాక్‌లతో నిర్మాణాలు కొనసాగిస్తున్నామని వాసవి తరపు సీనియర్ న్యాయవాది బి మయూర్‌రెడ్డి కోర్టుకు తెలిపారు.

ఎఫ్టీఎల్‌లో 8,9 బ్లాకులు ఉంటున్నాయన్నదే ప్రధాన ఆరోపణ అని అన్నారు. దీనికి సంబంధించి సర్వే పూర్తయిందని, నిర్మాణాలు బఫర్ జోన్‌లో జరగడంలేదని నివేదిక వచ్చిందన్నారు. బఫర్‌ జోన్‌లో ఈ రెండు బ్లాకుల నిర్మాణం జరిగిందని తేలితే తామే కూల్చిస్తామని హామీ ఇస్తామన్నారు. నిర్మాణాలు పూర్తి చేసి ప్లాట్లను విక్రయించి నిర్మాణ సంస్థ వెళ్లిపోతుందని, తరువాత బఫర్‌ జోన్‌లో నిర్మాణాలున్నాయని తేలినా తమకు సంబంధంలేదంటే పరిస్థితి ఏమిటని ధర్మాసనం ప్రశ్నించింది.

ఈ రెండు టవర్లలోని ప్లాట్లను విక్రయించగా వచ్చిన సొమ్మును జమ చేస్తామని.. ఒకవెళ బఫర్‌ జోన్‌లో ఉన్నాయని తేలితే - సొమ్మును ప్లాట్లు కొనుగోలు చేసినవారికి ఇస్తామన్నారు. ఇప్పటికే 50 శాతం ప్లాట్లు విక్రయించామనగా ధర్మాసనం జోక్యం.. చేసుకుంటూ తమకు తెలియకుండా ఎలా హామీ ఇస్తారని ఇప్పటికే కొనుగోలు చేసిన వారు ప్రశ్నిస్తే పరిస్థితి ఏమిటని ప్రశ్నించింది. సొమ్ము వాపసు ఇస్తామని వాసవి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: