ఏపీ ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ మద్దతు ఎవరికో?

Suma Kallamadi
ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభకు ఏకకాలంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఎవరికి మద్దతు ఇస్తారో అనే ఆసక్తి నెలకొంది. ఆయన తమ వాడంటే తమ వాడంటూ టీడీపీ, వైసీపీ ప్రచారం చేసుకుంటున్నాయి. ఎన్టీఆర్ మామ ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలోనే ఆయన వైసీపీలో చేరారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఆయన ఏపీ రాజకీయాల వైపు చూడడం లేదు. చంద్రబాబును ఏపీ ప్రభుత్వం అరెస్ట్ చేయించినప్పుడు సైతం ఆయన స్పందించలేదు. ఇక హెల్త్ యూనివర్సిటీకి ఏపీ ప్రభుత్వం పేరు మార్చినప్పుడు సైతం ఆయన ఓ లేఖ రాసి సరిపెట్టారు. ప్రస్తుతం ఏపీ ఎన్నికల్లో ఆయన ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. గతంలో ఆయన పార్టీకి దూరంగా ఉన్నప్పుడు కూడా టీడీపీకే తన చివరి శ్వాస వరకు మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం సైలెంట్‌గా ఉన్నారు. ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం టీడీపీకి దివంగత ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు, బీజేపీకి ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి అధ్యక్షులుగా ఉన్నారు. పురంధేశ్వరి జూనియర్ ఎన్టీఆర్‌కు స్వయాన మేనత్త. అయినప్పటికీ కూటమికి మద్దతు తెలపకుండా జూనియర్ సైలెంట్‌గా ఉన్నారు. అయితే ఇటీవల జూనియర్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
పాన్ ఇండియా సినిమా వార్-2లో ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. దానికి సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. అందులో వైట్ షర్ట్ వేసుకుని ఆయన సెట్ నుంచి బయటకు వస్తున్నట్లు ఉంది. అయితే దానిపై సైకిల్ గుర్తు ఉన్నట్లు కొన్ని ఫొటోలను టీడీపీ మద్దతుదారులు క్రియేట్ చేశారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో టీడీపీకి మద్దతుగా జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ చేస్తున్నట్లు అంతా భావించారు. అయితే అసలు ఫొటోలలో జూనియర్ ఎన్టీఆర్ షర్టుపై ఎలాంటి గుర్తు లేదు. దీనిని గ్రహించిన వైసీపీ మద్దతుదారులు కూడా ఆ షర్టుపై ఫ్యాన్ గుర్తు ముద్రించారు. ఆయన తమ పార్టీకి మద్దతుగా ప్రచారం చేస్తున్నారని ఊదరగొట్టేస్తున్నారు. దీంతో వైసీపీ, టీడీపీ ఎవరికి వారు జూనియర్ ఎన్టీఆర్ తమకే సపోర్ట్ ఇస్తున్నట్లు చెప్పుకుంటున్నాయి. బహిరంగంగా మద్దతు ఇవ్వకపోయినా జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటికీ టీడీపీకి మాత్రమే సపోర్ట్ చేస్తారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే ఆయన బహిరంగంగా టీడీపీకి మద్దతుగా నిలవకపోవడం కొంత ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: