జగన్‌ యాత్రలో ఆ నినాదాలు.. ఆ స్టూడెంట్స్‌ కొంప ముంచేశాయా?

Chakravarthi Kalyan
వైసీపీ అధినేత సీఎం జగన్ కు ఇటీవల వింత అనుభవం ఎదురైంది. వైసీపీ అధినేత ముందే విద్యార్థులు చంద్రబాబు, పవన్ లకు జై కొట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరిట బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. ఇటీవల బస్సు యాత్ర జగ్గంపేటలో సాగిన సమయంలో ఇలాంటి  అనుకోని ఘటన చోటు చేసుకుంది.

సీఎం బస్సు యాత్ర ఆదిత్య కాలేజీ వద్దకు రాగానే కొందరు విద్యార్థులు చేసిన నినాదాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జగన్ ముందే బాబులకే బాబు కల్యాణ్ బాబు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే ఆ నినాదాలు చేసిన విద్యార్థులపై ఆదిత్య కాలేజీ యాజమాన్యం చర్యలు తీసుకుంది. కాగా కళాశాల యాజమాన్యం తీసుకున్న నిర్ణయంపై విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రతిపక్షాలు అసహనం వ్యక్తం చేశాయి.

సీఎం జగన్ ఆదిత్య కళాశాల వద్దకు రాగానే యాజమాన్యం విద్యార్థులను రోడ్డుపై నిలబెట్టింది. జగన్ వచ్చినప్పుడు అభివాదం చేయాలని వారికి సూచించింది. అయితే కొందరు కాలేజీ వద్ద జగన్ బస్సు దిగుతుండగా జై పవన్ అంటూ పెద్దగా నినాదాలు చేశారు. దీంతో జగన్ ఓ మహిళతో మాట్లాడిడి వెళ్లిపోయారు. దీనిని సోషల్ మీడియా వేదికగా జనసేన భారీ ఎత్తున ప్రచారం చేసుకోవడం ప్రారంభించింది.

అయితే పవన్ కు అనుకూలంగా నినాదాలు చేసిన వారిపై కళాశాల యాజమాన్యం చర్యలు తీసుకోవడం.. సీఎం జగన్ ముందు సరిగ్గా ప్రవర్తించని కారణంగా సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించడంతో జనసేన, టీడీపీ వర్గాలు ఫైర్ అయ్యాయి. అన్యాయంగా విద్యార్థులను సస్పెండ్ చేస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. వీరిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది విద్యాసంస్థల అధినేత నల్లమిల్లి శేషారెడ్డి. ఈయన టీడీపీ సానుభూతిపరుడు. కావాలనే జగన్ ముందు నినాదాలు చేయించి.. ఆ తర్వాత సస్పెండ్ చేసి ఆ నెపాన్ని వైసీపీపై నెట్టి.. సానుభూతిని టీడీపీ, జనసేనలు పొందాలని ప్లాన్ చేశాయనే వాదన ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: