మురుగుడు లావణ్య దెబ్బ: లోకేశ్‌ మంగళగిరికే పరిమితం?

Chakravarthi Kalyan
ఏపీలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో మంగళగిరి ఒకటి. ఇక్కడ టీడీపీ ఆశా కిరణం నారా లోకేష్‌ రెండోసారి బరిలో దిగడమే అందుకు కారణం. అందులోనూ గత ఎన్నికల్లో ఇక్కడి నుంచే నారా లోకేష్‌ పోటీ చేసి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇప్పటికే ఒకసారి ఓడిన నారా లోకేష్‌కు ఈసారి గెలుపు అత్యవసరం. అందుకే ఆయన నిన్న మొన్నటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా దృష్టి సారించినా ప్రస్తుతం మంగళగిరికే పరిమితమై గల్లీ గల్లీలోనూ ప్రచారం జోరు పెంచేశారు.

ఇక ఇక్కడ వైసీపీ నుంచి చేనేత వర్గానికి చెందిన మురుగుడు లావణ్య బరిలో దిగారు. ఈమెది మంగళగిరిలో పేరున్న రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. ఆమె తల్లి కమల గతంలో ఇక్కడి ఎమ్మెల్యేగా, జడ్పీ ఛైర్మన్‌గానూ పని చేశారు. మురుగుడు లావణ్య మామ మురుగుడు హనుమంతరావు మంగళగిరి నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన మంత్రిగానూ పని చేశారు. బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో మురుగుడు లావణ్యను వైసీపీ నారా లోకేష్‌ పై  పోటీకి దింపింది.

రాజకీయ నేపథ్యం బాగానే ఉన్నా.. మురుగుడు కుటుంబం చేనేతలను రాజకీయంగా వాడుకోవడం తప్ప.. పెద్దగా చేసిందేమీ లేదన్న వాదన ఉంది. దీనికితోడు వైసీపీలో నేతలంతా ఐక్యంగా పోరాడుతున్న పరిస్థితి లేదు. ఎందుకంటే లావణ్య కంటే ముందు.. ఈ సీటును గంజి చిరంజీవికి కేటాయించారు. ఆ తర్వాత నిర్వహించిన సర్వేల్లో చిరంజీవికి అంత సానుకూలత రాకపోవడంతో మళ్లీ అభ్యర్థిని మార్చేశారు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా అంతగా శ్రద్ధ చూపడం లేదని తెలుస్తోంది. ఏకంగా ఆయన కూడా కొన్ని రోజులు పార్టీకి రాజీనామా చేసి.. కాంగ్రెస్‌లో చేరతానని చెప్పి.. మళ్లీ అనూహ్యంగా వైసీపీలోకి వచ్చేశారు.

ఇక లోకేష్‌కు గెలుపు చావో రేవో అన్నంత కీలకం కావడంతో ఆయన బాగా శ్రమిస్తున్నారు. రాష్ట్రమంతా వదిలేసి.. మంగళగిరికే పరిమితం అయ్యారు. గత ఎన్నికల్లో ఓడిపోయినా నారా లోకేష్‌ మంగళగిరిని వదిలిపెట్టలేదు. ఐదేళ్లుగా అక్కడే క్రియాశీలకంగా ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు చేశారు. ఇది ఆయనకు ప్లస్‌ పాయింట్‌ అవుతోంది. ప్రస్తుతానికి ఇక్కడ లావణ్యపై లోకేష్‌ ఆధిపత్యం కనబరుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: