అవినాష్‌రెడ్డి మౌనం.. వైసీపీ కొంప ముంచుతోందా?

Chakravarthi Kalyan
తెలుగు రాష్ట్రాల్లో ఐదేళ్లుగా కొనసాగుతున్న మిస్టరీ ఏదైనా ఉందంటే అది మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్యనే. 2019లో ఈ దారుణానికి ఒడిగట్టింది ఎవరు అనేది ఇంత వరకు తేలలేదు. గత ఎన్నికల సందర్భంగా తీవ్ర చర్చనీయాంశం అయిన వివేకా హత్య ఈ ఎన్నికలకు వచ్చే సరికి వివేకం పేరిట సినిమాగా రావడం విశేషం.

మాజీ మంత్రి వివేకా సాక్షాత్తూ మాజీ సీఎంకు స్వయానా తమ్ముడు. అలాంటి నాయకుడిని ఆయన ఇంట్లో అత్యంత కిరాతకంగా గొడ్డలితో నరికి చంపడం అంటే మామూలు విషయం కాదు. ఇక ఈ ఐదేళ్లు వివేకా హత్య కేసు అనేక మలుపులు తిరిగింది. హత్య అనంతరం అప్పటి ప్రతిపక్ష నేత జగన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమయంలో వివేకా కుమార్తె సునీత,  సోదరి షర్మిళ జగన్ వెంటే నిల్చొన్నారు. ఆ సమయంలో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి కూడా ఉన్నారు.

కాగా తదనంతరం జరిగిన ఎన్నికల్లో వైసీపీ అఖండ మెజార్టీతో విజయం సాధించడం సీఎంగా జగన్ బాధ్యతలు స్వీకరించడం చకచకా జరిగిపోయాయి. అనంతరం అనేక నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఈ కేసు సీబీఐ దర్యాప్తు వరకు వెళ్లింది. ఇప్పటికీ నాలుగేళ్లు అవుతున్నా ఈ కేసులో పురోగతి లేదు. కాగా ఇప్పుడు వైఎస్ షర్మిళ, సునీలకు ఎంపీ అవినాశ్ రెడ్డి, సీఎం జగన్ లే టార్గెట్ అయ్యారు.

ఈ సోదరీ మణులు రోజురోజుకూ విమర్శల్లో దూకుడు పెంచుతున్నారు తప్ప ఎక్కడా తగ్గడం లేదు. దీనిపై సీఎం జగన్ అసెంబ్లీ లో స్పష్టమైన ప్రకటన చేశారు. అవినాశ్ ఇలాంటి పని చేయడని తేల్చి చెప్పారు. మొన్న ఎన్నికల ప్రచార ప్రారంభంలో కూడా జగన్ ఇదే సంగతిని అన్యాపదేశంగా చెప్పారు. ఆ తర్వాత దీని గురించి మాట్లాడటం మానేశారు. అయితే ఇద్దరు అక్కలు షర్మిళ, సునీత నేరుగా దాడి చేస్తున్న సమయంలో ఎంపీ అవినాశ్ రెడ్డి నోరు విప్పాల్సిన అవసరం ఉంది. తనవంతుగా గట్టిగా ఖండించాల్సిన సందర్భం వచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: