చంద్రబాబు: కీలక సమయంలో ఆ కేసు గట్టి దెబ్బ వేయబోతోందా?

Chakravarthi Kalyan
స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణం చంద్రబాబుని వదిలేలా లేదు. ఎన్నికల వేళ ఈ కేసుకు సంబంధించి సీఐడీ మరోసారి ఛార్జిషీట్ దాఖలు చేసింది.  ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.  సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఏ1గా చంద్రబాబు, ఏ2గా అచ్చెన్నాయుడు, ఏ3గా గంటా సుబ్బారావు, ఏ4గా మాజీ ఐఏఎస్ లక్ష్మీ నారాయణ పేర్లను ఛార్జిషీట్ లో చేర్చారు.

టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం చంద్రబాబు పక్కా పన్నాగంతోనే రాష్ట్ర స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణానికి పాల్పడ్డారని సీఐడీ ఆరోపిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో చంద్రబాబుని అరెస్టు చేసి సెంట్రల్ జైల్లో 52 రోజుల పాటు ఉంచడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కాగా ఈకేసుకు దర్యాప్తునకు సంబంధించి సమగ్ర వివరాలతో సీఐడీ విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో గురువారం ఛార్జిషీట్ దాఖలు చేసింది.

ఇప్పటికే చంద్రబాబుని నిందితుడిగా చేర్చుతూ ఫైబర్ నెట్, అసైన్డ్ భూముల కేసులోను సీఐడీ అధికారులు చార్జిషీట్ దాఖలు చేశారు.  స్కిల్ డెవలమ్ మెంట్ కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్నారు. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీకి తెలియకుండానే ఆ కంపెనీ పేరుతో ఒప్పందాన్ని తెరపైకి తెచ్చి నిబంధనలకు విరుద్ధంగా ప్రజాధనాన్ని కొల్లగొట్టారని సీఐడీ ఈ ఛార్జిషీట్ లో పేర్కొంది. కుట్రలో భాగంగా సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలకు రూ.371 కోట్లు మళ్లించారని ఆరోపించింది.

రూ.330 కోట్ల విలువైన ప్రాజెక్టును రూ.3300 కోట్ల ప్రాఆజెక్టుగా కనికట్టు చేశారని వివరించింది. ఒప్పందంలో పేర్కొన్న ప్రకారం సీమెన్స్ కంపెనీ వాటా 90శాతం నిధుల్లో ఒక్క రూపాయి కూడా వెచ్చించకపోయినా ప్రభుత్వ వాటా పది శాతం నిధులను జీఎస్టీతో సహా రూ.371 కోట్లు నిబంధనలకు విరుద్ధంగా చెల్లించారని పేర్కొంది. అందులో రూ.241 కోట్లను షెల్ కంపెనీల పేరిట చంద్రబాబు కొల్లగొట్టారని వివరించింది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు ఉన్నందున ఈ కుంభకోణానికి సంబంధించి ఎఫ్ ఐఆర్ ను రద్దు చేయడం కుదరదని చంద్రబాబు వినతిని సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. మరోవైపు ఈ కేసులో చంద్రబాబు బెయిల్ ని కూడా రద్దు చేయాలని సీఐడీ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: