వెన‌క్కు త‌గ్గ‌ని అశోక్‌... రాత్రంతా ఎంపీ కోట‌గిరి చ‌ర్చ‌లు.. చింత‌ల‌పూడి వైసీపీ అభ్య‌ర్థి మార్పు కోసం ప‌ట్టు..!

RAMAKRISHNA S.S.
చింత‌ల‌పూడి వైసీపీలో గురువారం నెల‌కొన్న అస‌మ్మ‌తి జ్వాల‌లు ఆగ‌లేదు. చింత‌ల‌పూడి వైసీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థి కంభ‌పు విజ‌య‌రాజు తీరును నిర‌సిస్తూ ఏఎంసీ మాజీ చైర్మ‌న్ మేడ‌వ‌ర‌పు అశోక్‌బాబు ( సీనియ‌ర్ రాజ‌కీయ నేత కేవీపీ రామ‌చంద్ర‌రావు బావ‌మ‌రిది), ఆయ‌న భార్య అయిన కామ‌వ‌ర‌పుకోట ఎంపీపీ మేడ‌వ‌ర‌పు విజ‌య‌ల‌క్ష్మి ఇద్ద‌రూ త‌మ పార్టీ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేసేసిన సంగ‌తి తెలిసిందే. గురువారం ఈ విష‌యం తెలియ‌డంతో కామ‌వ‌ర‌పుకోట మండ‌లంలో ప‌లువురు వైసీపీ నేత‌ల‌తో పాటు 14 మంది ఎంపీటీసీలు, వైఎస్ ఎంపీపీలు, మండ‌లంలో ఉన్న అంద‌రు సొసైటీ అధ్య‌క్షులు, లింగ‌పాలెం మండ‌లానికి చెందిన కొంద‌రు పార్టీ నేత‌లు, ప‌లువురు పార్టీ ప్ర‌జాప్ర‌తినిధులు సైతం త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేసేశారు.
కామ‌వ‌ర‌పుకోట మండ‌లంలో అయితే వైసీపీ దాదాపు ఖాళీ అయిపోయేలా రాజీనామాలు జ‌రిగాయి. గురువారం ఉద‌యం నుంచి శుక్ర‌వారం కూడా కామ‌వ‌ర‌పుకోట మండ‌లంలోని క‌ళ్ల‌చెర్వులో అశోక్ ఇంటి వ‌ద్ద పార్టీ కార్య‌క‌ర్త‌లతో హ‌డావిడి మామూలుగా లేదు. కామ‌వ‌ర‌పుకోట మండ‌లంలో వైసీపీ నాయ‌కులు, ప్ర‌జాప్ర‌తినిధులు మూడొంతుల‌కు పైగా తామంతా అశోక్ వెంటే ఉంటామ‌ని.. అశోక్ ఏ నిర్ణ‌యం తీసుకున్నా ఆయ‌న బాట‌లోనే ఉంటామ‌ని తీర్మానాలు చేసేశారు. అశోక్ రాజీనామా వ్య‌వ‌హారం త‌ర్వాత కామ‌వ‌ర‌పుకోట‌, లింగ‌పాలెం మండ‌లాల నుంచి గ‌ట్టి స్పంద‌నే వ‌చ్చింది.
విజ‌య‌రాజు చేసిన త‌ప్పు ఇదేనా...
అశోక్ విజ‌య‌రాజుకు సీటు వ‌చ్చేందుకు ఏలూరు ఎంపీ కోట‌గిరి శ్రీథ‌ర్‌తో క‌లిసి ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. సీటు వ‌చ్చిన వెంట‌నే పార్టీని న‌ష్ట‌ప‌రిచిన ముగ్గురు నేత‌లు కామ‌వ‌ర‌పుకోట మండ‌లంలోనే ఉన్నార‌ని.. వారిని పూర్తిగా ప‌క్క‌న పెట్టేయాల‌ని కోరారు. వీరంతా ఎలీజా వ‌ర్గం నేత‌లుగా ఉన్నారు. ఆ క‌మిట్‌మెంట్‌కు ఓకే చెప్పిన విజ‌య‌రాజు ఇప్పుడు వారితోనే అంట‌కాగుతుండ‌డం అశోక్‌తో పాటు ఆయ‌న వ‌ర్గానికి చిర్రెత్తుకొచ్చేలా చేసింది. అలాగే వారి డైరెక్ష‌న్‌లో ముందుకు వెళుతున్నార‌న్న టాక్ వ‌చ్చేసింది. అక్క‌డితో ఆగ‌కుండా వీరిని వెంట‌పెట్టుకుని విజ‌య‌రాజు త‌న వియ్యంకుడు అయిన శాస‌న‌మండ‌లి చైర్మ‌న్ కొయ్యే మోషేన్‌రాజును క‌లిసిన ఫొటోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.
ఎంత స‌ర్ది చెప్పుకున్నా విజ‌య‌రాజు, మోషేన్‌రాజు త‌మ స‌మ్మ‌తి లేకుండా చింత‌ల‌పూడిలో ఎంపీ కోట‌గిరికి వ్య‌తిరేకంగా ఎమ్మెల్యే ఎలీజా టీంతో ఉన్న వాళ్ల‌తో క‌లిసే ప‌రిస్థితి లేదు. ఆల్రెడీ అశోక్ కండీష‌న్ పెట్టినా కూడా త‌మ‌కు వ్య‌తిరేకంగా ఉన్న నేత‌ల‌తో అటు మోషేన్‌రాజు, ఇటు విజ‌య‌రాజు ఇద్ద‌రూ క‌ల‌వ‌డం ఎంపీ వ‌ర్గం నేత‌ల‌కు అస్స‌లు న‌చ్చ‌లేదు. దీంతో పాటు కామ‌వ‌ర‌పుకోట మండ‌లంలో అంత‌కుముందు జ‌రిగిన ఒక‌టి రెండు సంఘ‌ట‌న‌లు కూడా ఎంపీ వ‌ర్గం నొచ్చుకునేలా చేశాయి.
రాత్రంతా ఎంపీ కోట‌గిరి ... అశోక్ ఇంట్లోనే...
అశోక్‌తో పాటు ఆయ‌న వ‌ర్గం నేత‌లు రాజీనామా చేయ‌డంతో చింత‌ల‌పూడి వైసీపీలో ఒక్క‌సారిగా అల్ల‌క‌ల్లోలం రేగింది. ఎమ్మెల్యే క్యాండెట్ విజ‌య‌రాజుతో పాటు ఆయ‌న వియ్యంకుడు మండ‌లి చైర్మ‌న్ మోషేన్‌రాజు కంగుతిన్నారు. ఇక్క‌డ ప‌రిస్థితిపై ఏలూరు పార్ల‌మెంటు అభ్య‌ర్థిగా ఉన్న కారుమూరి సునీల్‌కుమార్ తండ్రి, మంత్రి కారుమూరి నాగేశ్వ‌ర‌రావు సైతం ఆరా తీశారు. ఆశోక్‌ను స‌ముదాయించే ప్ర‌య‌త్నాలు ఆయ‌న మొద‌లు పెట్టారు. ఇటీవ‌ల వైసీపీలో చేరిన ఏలూరు పార్ల‌మెంట‌రీ నేత గోరుముచ్చు గోపాల్ యాద‌వ్ వీరంతా అశోక్ నివాసానికి చేరుకుని ఆయ‌న‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు.
పార్టీ క్యాండెట్ మార్పుపై అశోక్ పంతం..
ఇక ఎంపీ కోట‌గిరి శ్రీథ‌ర్ గురువారం అర్ధ‌రాత్రి 2 గంట‌ల వ‌ర‌కు కూడా అశోక్‌తో ఆయ‌న నివాసంలోనే చ‌ర్చ‌లు జ‌రుపుతూనే ఉన్నారు. కొంద‌రు పార్టీ నేత‌లు వెంట‌నే విజ‌య‌రాజును పిలిపించాల‌ని.. పార్టీలో వ్య‌తిరేకుల‌ను ఎంక‌రేజ్ చేస్తోన్న ఆయ‌న తీరును ఖండించారు. ఎంపీ శ్రీథ‌ర్ కార్య‌క‌ర్త‌ల‌ను స‌ముదాయించి ఆవేశాన్ని క‌ట్ట‌డి చేసే ప్ర‌య‌త్నం చేశారు. ఇండియా హెరాల్డ్‌కు అందిన విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం అశోక్ వెన‌క్కు త‌గ్గే ప్ర‌శ‌క్తే లేద‌ని ఎంపీ కోట‌గిరికి తేల్చిచెప్పార‌ని.. ఆయ‌న చింత‌ల‌పూడి వైసీపీ అభ్య‌ర్థి మార్పుకు సైతం గ‌ట్టిగా ప‌ట్టుబ‌డుతున్నార‌ని తెలిసింది. మ‌రి చింత‌ల‌పూడి వైసీపీలో నెల‌కొన్న ఈ అల్ల‌క‌ల్లోలం ఎలా ముగుస్తుందో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: