గోదావరి : జోగయ్యే ఎదురుతిరుగుతున్నారా ?

Vijaya


మొదటినుండి గట్టి మద్దతుదారుడు చేగొండి హరిరామజోగయ్యే ఇపుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఎదురుతిరుగుతున్నారా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు, పవన్ కు రాసిన తాజా లేఖను చదివిన తర్వాత అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకోవటాన్ని జోగయ్య సమర్ధించారు. అయితే పొత్తు ద్వారా పోటీచేయబోయే సీట్లు గౌరవప్రదంగా ఉండాలని మాత్రమే మొదటినుండి జోగయ్య చెబుతున్నారు. సీట్లకోసం చంద్రబాబునాయుడును పవన్ యాచించటం కాదని శాసించే స్ధాయికి ఎదగాలని కోరుకున్నారు.



పోటీచేసే సీట్ల సంఖ్య గౌరవప్రదంగా లేకపోతే కాపు సామాజికవర్గం అంగీకరించదని రెండుపార్టీల మధ్య ఓట్లు బదిలీకావని చాలాకాలంగా జోగయ్య పదేపదే పవన్ కు చెబుతునే ఉన్నారు. పనిలోపనిగా జనసేన 50-60 సీట్లకు తక్కువకాకుండా పోటీచేయాలని కాపులు అనుకుంటున్న విషయాన్ని కూడా జోగయ్య జనసేన అధినేతకు చాలాసార్లు చెప్పారు. అయితే సీట్ల షేరింగ్ దగ్గరకు వచ్చేసరికి జనసేనకు 25 సీట్లకన్నా ఇచ్చేదిలేదని చంద్రబాబు గట్టిగా చెప్పేశారు. దానికి పవన్ కూడా అంగీకరించారన్న విషయమే ఇపుడు కాపుల్లో మంటకు దారితీసింది.



అదే విషయాన్ని పవన్ను ఉద్దేశించి జోగయ్య లేఖరాశారు. అందులో పవన్ను తప్పుపడుతు జోగయ్య చాలా అంశాలను ప్రస్తావించారు. చంద్రబాబు ఇచ్చిన సీట్లను మహాప్రసాదంగా పవన్ తీసుకోవటాన్ని జోగయ్య తప్పుపట్టారు. పవన్ వైఖరి కారణంగా కాపులు జనసేన-టీడీపీ పొత్తును సమర్ధించటంలేదని చెప్పారు. జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి దింపటం అంటే చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయటమేనా అని పవన్ను సూటిగా ప్రశ్నించారు.



చంద్రబాబు సీఎంను చేయటం కోసం కాపులు టీడీపీ పల్లకి మోయాలా అని నిలదీశారు. సీట్ల షేరింగ్ నేపధ్యంలో రెండుపార్టీలకు జనాలు ఓట్లేయని కారణంగా మళ్ళీ వైసీపీనే అధికారంలోకి వస్తే అందుకు చంద్రబాబు, పవనే బాధ్యత వహించాలని స్పష్టంగా చెప్పారు. మొత్తానికి జోగయ్య రాసిన బహిరంగలేఖ కాపుల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. అలాగే పవన్ వైఖరిని తప్పుపడుతు కాపుల్లో చర్చలు మొదలయ్యాయి. మరి జోగయ్య మాటను పవన్ ఎంతవరకు వింటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: