ఆంధ్రప్రదేశ్ లో మూడు జిల్లాలకు జీవనధారగా నిలిచే వెలుగొండ ప్రాజెక్ట్.. రెండో టన్నెల్ కూడా కంప్లీట్ అయింది.రికార్డ్ టైంలో రెండో టన్నెల్ బ్రేక్ త్రూ సాధించింది మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ కంపెనీ.వెలుగొండ ప్రాజెక్టులో రెండు టన్నెల్స్ నిర్మాణంలో చిన్న చిన్న పనులు తప్ప అన్ని పూర్తయినట్లేనని కంపెనీ ప్రకటించింది. టన్నెల్ బోరింగ్ మెషిన్ ద్వారా రెండు టన్నెల్స్ నిర్మాణాన్ని ఎంఈఐఎల్ పూర్తి చేసింది. ప్రకాశం జిల్లా దోర్నాల సమీపంలోని కొత్తూరు నుంచి శ్రీశైలం ప్రాజెక్ట్ పై భాగంలోని కొల్లం వాగు దాకా రెండు టన్నెల్స్ తవ్వకం పనులను ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ చేపట్టింది. 2019 వరకు నిదానంగా సాగాయి వెలుగొండ ప్రాజెక్ట్ పనులు. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక 2020లో కాంట్రాక్ట్ దక్కించుకున్న మేఘా కంపెనీ మొదటి టన్నెల్లో 3. 6 కిలోమీటర్లు పనులు.. 2021 జనవరి నాటికి కేవలం 13 నెలల్లోనే పూర్తి చేసింది.ఇక ఆ తర్వాత.. రెండో టన్నెల్లో ఏడున్నర కిలోమీటర్ల పనులను చేసిన ఎంఈఐఎల్ విజయవంతంగా పూర్తి చేసింది.
ఈ వెలుగొండ టన్నెల్ తవ్వకానికి.. ఆసియాలోనే అతిపెద్ద కన్వేయర్ బెల్ట్‌ను కూడా ఉపయోగించారు. అడవి ప్రాంతంలో పనులు కావడంతో పగటి వేళలోనే పనులు చేయాల్సి వచ్చింది. కార్మికులు, మెటీరియల్ సరఫరాలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కానీ పనులు పూర్తి చేశామన్నారు మేఘా కంపెనీ ప్రతినిధులు. వెలుగొండ ప్రాజెక్ట్‌తో ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని 30 మండలాలకు చెందిన 16 లక్షల మందికి తాగు నీరు అందుతుంది. మొదటి టన్నెల్ ఏడు డయా మీటర్ల వ్యాసార్ధంతో, రెండో టన్నెల్ 9 . 2 డయా మీటర్ల వ్యాసార్ధంతో తవ్వడం జరిగింది. రోజుకు ఒక టిఎంసి నీటిని తరలించేలాగా వీటిని డిజైన్ చేశారు. టన్నెల్స్ తవ్వకాన్ని పూర్తి చేసిన కాంట్రాక్టు కంపెనీ, సిబ్బందిని ప్రభుత్వం ఎంతగానో అభినందించింది. వచ్చే సీజన్లో నీటిని ఈ టన్నెల్స్ ద్వారా విడుదల చేస్తామని చెప్పారు ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్.