అమరావతి : బస్సుయాత్ర ఫలితమేనా ?

Vijaya



సామాజిక సాధికార బస్సుయాత్రల ప్రభావం పార్టీపైన స్పష్టంగా కనబడుతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటి వర్గాలకు తాను పెట్టపీట వేస్తున్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి పదేపదే గుర్తుచేస్తున్నారు. పంచాయితి ఎన్నికల నుండి పార్లమెంటు ఎన్నికల వరకు పై సామాజికవర్గాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పై సామాజికవర్గాల మద్దతును పెంచుకోవటం కోసం వివిధ సామాజికవర్గాల మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపీలు, ఎంఎల్సీలు, నేతలతో బస్సుయాత్రలు చేయిస్తున్నారు. పార్టీవర్గాల సమాచారం ప్రకారం యాత్రలు బాగా సక్సెస్ అవుతున్నాయి.



ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో సడెన్ గా 11 నియోజకవర్గాల్లో ఇన్చార్జిలను మార్చేశారు. ముగ్గురు మంత్రులను కూడా తమ నియోజకవర్గాలకు కాకుండా ఇతర నియోజకవర్గాలకు ఇన్చార్జిలుగా నియమించారు. స్ధానచలనం పొందిన వారిలో ఎస్సీ, బీసీ, రెడ్డి ఎంఎల్ఏలు ఎక్కువగా  ఉన్నారు. బహుశా వీరిని ఈ నియోజకవర్గాల నుండి పోటీచేయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తొందరలోనే మరో 30-35 నియోజకవర్గాల్లో కూడా మార్పులుంటాయని పార్టీ వర్గాల సమాచారం.



ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బస్సుయాత్రలను జగన్ ఊరికే చేయించటంలేదు. ఒకవైపు బస్సుయాత్రలు జరుగుతుండగానే మరోవైపు ఆ యాత్ర జరిగిన నియోజకవర్గాల్లో విస్తృతంగా సర్వేలు చేయిస్తున్నారు. పార్టీ, ప్రభుత్వం పనితీరుపై జనాభిప్రాయాన్ని జగన్ సేకరిస్తున్నారు. వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగానే ఇపుడు మార్పులు చేశారట. అంటే ఇపుడు చేసిన, చేయబోయే మార్పులకు బస్సుయాత్రల ఫీడ్ బ్యాకే కారణమని అర్ధమవుతోంది. రాబోయే ఎన్నికల్లో 175కి 175 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా జగన్ పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే సర్వేల్లో నెగిటివ్ మార్కులు వచ్చిన ఎంఎల్ఏలకు టికెట్లు ఇచ్చేదిలేదని జగన్ పదేపదే చెబుతున్నారు. ఇదే సమయంలో రెడ్డి ఎంఎల్ఏల నియోజకవర్గాల్లో బీసీలకు టికెట్లు ఇవ్వటమనే కాన్సెప్టు తీసుకొస్తున్నారు.



ఈమధ్యనే జరిగిన తెలంగాణా ఎన్నికల ఫలితాల ప్రభావం కూడా కొంత ఉండచ్చు. ఎలాగంటే చివరి నిముషంలో కేసీయార్ 12 మంది సిట్టింగులను మార్చి కొత్తవారికి  టికెట్లిచ్చారు. అందులో 10 మంది గెలిచారు. అందుకనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని పక్కనపెట్టకపోతే పార్టీకి నష్టం జరగుతుందని జగన్ ఇప్పటికే డిసైడ్ అయ్యారు. అయితే అంతర్గతంగా జగన్ చేస్తున్న మార్పులను ఎల్లోమీడియా నెగిటివ్ గా ప్రచారం చేస్తోంది. సమన్వయకర్తల సమరమని, పార్టీలో ముసలమని కథనాలు ఇచ్చుకుని సంతోష పడిపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: