అమరావతి : ఏడు జిల్లాల మీదే దృష్టిపెట్టారా ?
తొందరలోనే చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో జాయింట్ మీటింగులు జరగబోతున్నాయి. ఇందుకు ఈనెల 17వ తేదీన భీమిలీలో జరగబోయే బహిరంగసభ నాందిపలుకుతోంది. లోకేష్ పాదయాత్ర యువగళం ముగింపు సందర్భంగా భీమిలీలో టీడీపీ బహిరంగసభ జరగబోతోంది. ఈ సభ ఏర్పాట్లలో టీడీపీతో పాటు జనసేన నేతలు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అంటే ఒకరకంగా బహిరంగసభ ఏర్పాట్లను రెండుపార్టీలు కలిసి చేస్తున్నాయనే అనుకోవాలి. ఈ బహిరంగసభలో చంద్రబాబు, పవన్ ఇద్దరు పాల్గొంటున్నారు.
అలాగే ఇదే నెలలో మరో రెండు జిల్లాల్లో కూడా ఇద్దరు కలిసే ప్రచారంలో పాల్గొనాలని డిసైడ్ అయ్యారు. జనవరిలో సంక్రాంతి పండుగ వరకు మరో మూడు నాలుగు సభల్లో కలిసే ప్రచారం చేయబోతున్నారు. సంక్రాంతి పండుగ తర్వాత నుండి ప్రతి జిల్లాలోను మూడు నాలుగు బహిరంగసభలు నిర్వహించాలని అనుకున్నారు. అయితే దీనికి సంబంధించిన షెడ్యూల్, రూటుమ్యాపును రెండుపార్టీల నేతలు జనవరి మొదటివారంలో కూర్చుని డిసైడ్ చేస్తారు.
ఫిబ్రవరి, మార్చిలో ఎన్నికల షెడ్యూల్ రిలీజవుతుందని అనుకుంటున్నారు. అందుకని ఇప్పటినుండే తొందరపడకపోతే తర్వాత ఇబ్బందులు ఎదురవుతాయని అధినేతలు అనుకున్నారు. మొన్న బుధవారం జరిగిన భేటీలో ఈ విషయాలపైనే ఇద్దరు ఎక్కువగా చర్చించుకున్నారట. జాయింట్ ప్రచారసభలు ఏ ప్రాంతంలో ఎక్కువగా జరగాలి ? ఏ జిల్లాలపైన ఎక్కువగా దృష్టిపెట్టాలన్నది రెండుపార్టీల నేతలు డిసైడ్ చేస్తారు. అయితే ముఖ్యంగా ఏడు జిల్లాలపైన దృష్టిపెట్టబోతున్నట్లు పార్టీవర్గాల సమాచారం. అవేమిటంటే మొన్నటి ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన జిల్లాలు కడప, కర్నూలు, విజయనగరం, నెల్లూరు. ఈ నాలుగు జిల్లాల్లోనే 43 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి.
కాబట్టి పై జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెడితే వీలైనన్ని సీట్లను టీడీపీ, జనసేన గెలుచుకోవచ్చని అధినేతలు అనుకున్నారట. తర్వాత అనంతపురం, చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాలపైన దృష్టిపెట్టారట. ఎందుకంటే పై జిల్లాల్లో 38 నియోజకవర్గాలుంటే టీడీపీ గెలుచుకున్నది ఐదు మాత్రమే. అందుకనే ఈ ఏడు జిల్లాలను చంద్రబాబు, పవన్ ప్రత్యేకంగా చూస్తున్నారు. ఇక్కడ గనుక తక్కువలో తక్కువ సగం సీట్లను గెలుచుకోగలిగితే గెలుపు తమదే అన్న ఆలోచనతో ఉన్నట్లు పార్టీవర్గాల సమాచారం. అందుకనే ఇద్దరూ జాయింట్ ప్రచారం చేస్తే ఎఫెక్టు బాగా ఉంటుందని అనుకునే అందుకు తగ్గట్లుగా ప్లాన్ చేస్తున్నారని సమాచారం.