భార్యలను టార్చర్ చేసే భర్తలకి స్వర్గమా- నరకమా? గరుడపురాణంలో ఏం ఉందో తెలుసా?

Thota Jaya Madhuri
అష్టాదశ పురాణాల్లో ఒకటైన గరుడ పురాణం హిందూ ధార్మిక గ్రంథాల్లో ఎంతో విశిష్టమైనది. ఈ పురాణంలో భగవాన్ శ్రీ మహా విష్ణువు, తన వాహనమైన గరుత్మంతునికి మానవ జీవితం, కర్మఫలం, మరణానంతరం ఆత్మకు ఎదురయ్యే అనుభవాలు, యమలోక ప్రయాణం వంటి అనేక ఆధ్యాత్మిక విషయాలను విపులంగా వివరించాడు. మరణ సమయంలో మనిషి పొందే బాధలు, ఆనందాలే కాకుండా, జీవించి ఉండగా మనిషి చేసే మంచి–చెడుల ప్రభావం ఎలా ఉంటుందో కూడా గరుడ పురాణం స్పష్టంగా వివరిస్తుంది.
ప్రత్యేకంగా, భార్యాభర్తల మధ్య ఉండవలసిన పవిత్రమైన బంధం, భర్తగా ఒక పురుషుడు ఎలా ప్రవర్తించాలి, భార్యను ఎలా గౌరవించాలి, ఎలా చూసుకోవాలి అనే అంశాలపై గరుడ పురాణంలో స్పష్టమైన నియమాలు ఉన్నాయి. అదే సమయంలో, భర్త తన భార్యతో ఎలా ప్రవర్తించకూడదో కూడా కఠినమైన హెచ్చరికలు ఇవ్వబడ్డాయి.



హిందూ ధర్మంలో భార్యాభర్తల సంబంధాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ బంధంలో “నువ్వు గొప్ప–నేను గొప్ప” అనే భావనకు చోటు లేదు. ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ, పరస్పర అవగాహనతో, సమానంగా జీవించడమే నిజమైన వైవాహిక జీవితం అని గ్రంథాలు చెబుతాయి.గరుడ పురాణం ప్రకారం, భార్యను కేవలం భోగవస్తువుగా లేదా పనిమనిషిగా కాకుండా, జీవిత సహచరిగా, అర్ధాంగిగా భావించాలి. అలా వ్యవహరించే భర్తకు సుఖశాంతులతో కూడిన కుటుంబ జీవితం లభిస్తుంది. గరుడ పురాణంలోని ఏడవ అధ్యాయం ప్రకారం, ఒక భర్త తన భార్యను శారీరకంగా కొట్టడం, హింసించడం లేదా మాటలతో, ప్రవర్తనతో మానసికంగా వేధించడం వంటి పనులు చేస్తే, అతడు తీవ్రమైన పాపాన్ని చేసినవాడవుతాడు.



అటువంటి వ్యక్తిని మరణానంతరం ‘రౌరవ నరకానికి’ పంపిస్తారని గరుడ పురాణం చెబుతుంది.రౌరవ నరకంలో ‘రురు’ అనే భయంకరమైన పాము నివసిస్తుందని, అది పాపాత్ములను నిరంతరం కాటేస్తూ అసహనకరమైన బాధను కలిగిస్తుందని వర్ణించబడింది.
ఇదే విషయాన్ని మనుస్మృతి కూడా సమర్థిస్తుంది. తన భార్యను వేధించే పురుషుడు ఈ జన్మలోనే కాదు, మరుజన్మలో కూడా తీవ్రమైన బాధలను అనుభవించాల్సి వస్తుందని స్పష్టంగా చెబుతుంది. భార్యను వదిలిపెట్టి లేదా ఆమెను నిర్లక్ష్యం చేసి, ఇతర స్త్రీలతో అనైతిక సంబంధాలు కలిగి ఉండే భర్త గురించి గరుడ పురాణంలో చాలా కఠినమైన హెచ్చరిక ఉంది.



గరుడ పురాణంలోని 10వ శ్లోకం ప్రకారం:

“యస్తు భార్యాపరిత్య పరస్త్రిషు రామేత్ నరః।
స కుంభీపాకే గోరే పచ్యతే కాలసంత్య॥”

అర్థం:
తన భార్యను వదిలి, ఇతర స్త్రీలతో సంబంధాలు పెట్టుకునే పురుషుడు మరణానంతరం కుంభీపాక నరకంలో పడవేయబడతాడు.కుంభీపాక నరకంలో యమదూతలు ఆత్మను మరిగే నూనెలో వేసి భయంకరంగా హింసిస్తారని పురాణాలు వర్ణిస్తాయి. ఈ శిక్ష ఆత్మకు తట్టుకోలేనంత ఘోరమైనదిగా చెప్పబడింది.


భార్యను మాటలతో, ప్రవర్తనతో లేదా సమాజంలో అవమానించే భర్త గురించి మహాభారతంలోని ఆనుశాసనిక పర్వం (88వ అధ్యాయం) స్పష్టంగా చెబుతుంది. తన భార్యను అవమానించిన వ్యక్తి మరణానంతరం మాత్రమే కాదు, తదుపరి జన్మలో కూడా తీవ్ర బాధలను అనుభవించాల్సి వస్తుందని అక్కడ ఉంది. అదే విధంగా, మనుస్మృతి ప్రకారం, స్త్రీని అవమానించే వ్యక్తి జీవితం క్రమంగా నరకంతో సమానంగా మారుతుంది. అతడికి మనశ్శాంతి ఉండదు, కుటుంబ సుఖం ఉండదు, చివరకు ఆధ్యాత్మికంగా కూడా పతనమవుతాడు. భార్య భావోద్వేగాలను విస్మరించడం, ఆమె ప్రేమను అర్థం చేసుకోకపోవడం, ఆమెను నిర్లక్ష్యం చేయడం కూడా గరుడ పురాణం ప్రకారం పాపమే.భార్యను ప్రేమించకుండా, ఆమెను బలవంతంగా పని చేయించుకోవడం లేదా ఆమె శ్రమను దుర్వినియోగం చేయడం వంటి చర్యలు చేసే భర్త భౌతిక జీవితంలోనే కాకుండా ఆధ్యాత్మిక ప్రయాణంలో కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటాడు. అటువంటి వ్యక్తి తన కర్మఫలంగా ఘోరమైన శిక్షలను అనుభవించాల్సి వస్తుందని గ్రంథాలు హెచ్చరిస్తున్నాయి.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. ఇది ఎంత వరకు నమ్మాలి అనేది పూర్తిగా  పాఠకుల అభిప్రాయం మాత్రమే.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: