రాహుల్‌పై కేటీఆర్‌ ప్రశ్నల వర్షం? ఆన్సర్స్‌ ప్లీజ్‌?

Chakravarthi Kalyan
తెలంగాణపై అన్ని పార్టీల అగ్రనేతలు మోహరించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ప్రశ్నలు వేశారు. దేశంలో గత పదేళ్లల్లో తెలంగాణ కంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన రాష్ట్రం ఏదైనా ఉందా అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. తొమ్మిదిన్నరేళ్లల్లో 2 లక్షల 2వేల 735 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి ఒక లక్షా 60 వేల 083 నియామకాలు పూర్తి చేశామని.. ఈ లెక్కతప్పని నిరూపించగలరా అని కేటీఆర్ ప్రశ్నించారు.

కాంగ్రెస్ అధికారంలో ఉన్న పదేండ్ల కాలంలో తెలంగాణలో భర్తీ చేసిన ఉద్యోగాలు ఎన్ని అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. అవి కేవలం 10 వేల 116 మాత్రమేనన్న మంత్రి కేటీఆర్.. ఇదేనా నిరుద్యోగులపై ప్రేమ అనిటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్, హిమాచల్‌ప్రదేశ్‌లో ఉద్యోగాల భర్తీ హామీ మరిచి నిరుద్యోగులను ముంచింది నిజం కాదా అని మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ హయాంలో ఏటా ఇచ్చింది కేవలం 1012 జాబులేనని మంత్రి కేటీఆర్  అన్నారు.

రాహుల్ గాంధీ  జీవితంలో ఎప్పుడైనా ఉద్యమం చేశావా...? ఉద్యోగం చేశావా...? యువత ఆశలు ఆకాంక్షలు తెలుసా...? పోటీ పరీక్షలు రాసినవా...? ఇంటర్వ్యూకు వెళ్లినవా...? ఉద్యోగార్థుల ఇబ్బందులు ఏమన్నా అర్థమవుతాయా అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. 95 శాతం ఉద్యోగాలు స్థానిక బిడ్డలకే దక్కేలా కొత్త జోనల్ వ్యవస్థ తీసుకొచ్చామని.. మా కొలువులు మాకే దక్కాలన్న ఉద్యమస్ఫూర్తి నిలబెట్టి నియామకాల నినాదం నిజం చేసిన వాస్తవాన్ని కాదనగలవా అని మంత్రి కేటీఆర్ అన్నారు.

1972లో సుప్రీంకోర్టు ముల్కీ నిబంధలు సమర్థిస్తూ తీర్పునిస్తే పార్లమెంట్‌లో చట్టంచేసి రద్దు చేసి కాంగ్రెస్ తెలంగాణ స్థానికత హక్కులకు సమాధి కట్టిందని మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్  6 సూత్రాలు... 610 జీవోలు... గిర్ గ్లానీ నివేదకలు తుంగలో తొక్కిందని  హైదరాబాద్ ఫ్రీ జోన్‌గా మార్చేసి స్థానికేతర కోటాలు పెట్టి తెలంగాణ యువతకు దక్కాల్సిన కొలువులు కొల్లగొట్టి తీరని అన్యాయం చేసిన ద్రోహులు మీరు కాదా అని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: