గోదావరి : పిల్లి ఔట్..జగన్ పై తిరుగుబాటేనా ?

Vijaya


కొంతకాలంగా ఊహిస్తున్న విషయమే ఇది. రాబోయే ఎన్నికల్లో రామచంద్రాపురం అసెంబ్లీ టికెట్ విషయమై రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్- సిట్టింగ్ ఎంఎల్ఏ, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ మధ్య బాగా వివాదం నడుస్తోంది. వచ్చేఎన్నికల్లో మంత్రే ఇక్కడనుండి పోటీచేస్తారని జిల్లా ఇన్చార్జి, ఎంపీ, మిథున్ రెడ్డి ప్రకటించటంతో నివురుగప్పిన నిప్పులాగున్న వివాదం ఒక్కసారిగా బయటపడింది. జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోనే మిథున్ మంత్రి అభ్యర్ధిత్వాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.





స్వయంగా జగన్ తరపున ఎంపీ చెల్లుబోయినకు టికెట్ ప్రకటించటాన్ని పిల్లి తట్టుకోలేకపోతున్నారు. అందుకనే తిరుగుబాటుకు సైతం రెడీఅయిపోయారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతు రాబోయే ఎన్నికల్లో చెల్లుబోయిన పోటీచేస్తే సహకరించేదిలేదన్నారు. తనకు టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా అయినా సరే పోటీచేసి తీరుతానన్నారు. క్యాడర్ మొత్తం తమ కుటుంబమే పోటీచేయాలని గట్టిగా కోరుతున్నారట. చెల్లుబోయిన పోటీచేస్తే క్యాడర్ ఎవరు సహకరించరని వార్నింగ్ కూడా ఇచ్చారు.





అంటే పిల్లి చెప్పిన మాటలు, వార్నింగులు, చాలెంజులన్నీ జగన్ను ఉద్దేశించి చేసినవనే గుర్తించాలి. 2014, 19 ఎన్నికల్లో ఓడిపోయినా పిల్లికి జగన్ అత్యంత ప్రాధాన్యతిచ్చారు. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయినా మంత్రివర్గంలోకి తీసుకుని తర్వాత ఎంఎల్సీని చేశారు. ఆ తర్వాత రాజ్యసభ అవకాశం వస్తే ఎంపీగా పంపారు. మొదటినుండి జగన్ కు నమ్మినబంటుగా ఉన్న పిల్లి ఇపుడు జగన్ కే ఎదురుతిరుగుతున్నారు.





తనకు పార్టీ ముఖ్యమే కాదని క్యాడరే ముఖ్యమని చెబుతున్నారు. తనవల్ల పార్టీకి ఏనాడూ నష్టం జరగలేదని ఒకవైపు చెబుతునే మరోవైపు జగన్ నిర్ణయాన్ని థిక్కరిస్తుండటం ఆశ్చర్యంగా ఉంది. మీడియాతో ఇన్నిమాటలు మాట్లాడారంటే పార్టీలో నుండి బయటకు వచ్చేయాలని డిసైడ్ అయిపోయినట్లే అనుమానంగా ఉంది. ప్రత్యామ్నాయం చూసుకునే పిల్లి ఇలాగ మాట్లాడుతున్నారని పార్టీవర్గాల్లో టాక్ మొదలైంది. జగన్ నిర్ణయాన్ని పిల్లి సవాలు చేస్తారని ఎవరు ఊహించలేదసలు. మొత్తానికి జగన్ కు నమ్మకస్తుడిగా ఉంటు అనేక పదవులు అందుకుని ఇపుడు ఎదురుతిరుగుతుండటమే విచిత్రంగా ఉంది. ఇలాంటి వాళ్ళు ఇంకా ఎందరున్నారో ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: