గోదావరి : ఎంపీలో అయోమయం పెరిగిపోతోందా ?
నరసాపురం వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజులో అయోమయం పెరిగిపోతున్నట్లుంది. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ తరపున పోటీచేయాలో, ఏ నియోజకవర్గంలో పోటీచేయాలో కూడా తేల్చుకోలేకపోతున్నారట. రఘురాజు మనసంతా జనసేన తరపున పోటీచేయాలని ఉన్నట్లుంది. అదెప్పుడంటే బీజేపీ, జనసేన మిత్రపక్షాలుగా ఉంటే మాత్రమే. నరసాపురం ఎంపీగానే జనసేన అభ్యర్ధిగా రంగంలోకి దిగి తెలుగుదేశంపార్టీ మద్దతును మ్యానేజ్ చేసుకోవచ్చని ఇంతకాలం ఆలోచిస్తున్నారు.
అయితే తాజా పరిణామాలను గమనిస్తే బీజేపీకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ దాదాపు కటీఫ్ చెప్పేసినట్లే అనిపిస్తోంది. ఎప్పుడైతే చంద్రబాబునాయుడుతో చేతులు కలిపారో అప్పుడే బీజేపీతో బంధం తెగిపోయినట్లే అని జనసేనపార్టీలో చర్చలు మొదలయ్యాయి. ఈ కారణంగానే మొన్నటి చంద్రబాబునాయుడు చిలకలూరిపేట పర్యటనలో టీడీపీ, జనసేన కార్యకర్తలు కలసి పాల్గొన్నది. చంద్రబాబు పర్యటన మొత్తం రెండుపార్టీల జెండాలను అందరు గమనించే ఉంటారు.
సో వచ్చేఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తుపెట్టుకుంటే బీజేపీ తరపున నరసాపురం నియోజకవర్గంలో కచ్చితంగా ఎవరో ఒకళ్ళు పోటీచేస్తారు. సినీనటుడు ప్రభాస్ సోదరుడు పోటీచేసే అవకాశం ఉందంటున్నారు. బీజేపీ గెలిచినా గెలవకపోయినా రాజుల ఓట్లు చీలిపోయి రఘురాజు ఓడిపోవటం ఖాయం. అలాగని బీజేపీలో చేరి తానే పోటీచేద్దామని అనుకుంటే ఇక్కడ ప్రత్యేకంగా బీజేపీకి ఓటుబ్యాంకంటు లేదు. అప్పుడెప్పుడో కృష్ణంరాజు గెలిచారంటే అది కాంగ్రెస్ ఓటుబ్యాంకు పుణ్యమనే చెప్పాలి. రఘురాజు గెలిచింది కూడా వైసీపీ కారణంగానే.
కాబట్టి రఘురాజు మళ్ళీ గెలవాలంటే బీజేపీ, జనసేన, టీడీపీ కలిసుండాలి. మూడుపార్టీలు రెండుగా విడిపోతే రఘురాజు గెలుపు కష్టమే. టీడీపీతో కలవకూడదని బీజేపీ నేతలు గట్టిగానే ఉన్నారు. తనకోసమని ఈ రెండుపార్టీలు కలవవని రాజుకు బాగా తెలుసు. అందుకనే వచ్చే ఎన్నికల్లో పోటీ విషయమై రఘురాజులో టెన్షన్ పెరిగిపోతోందట. మిత్రపక్షంతో తెగతెంపులు చేసుకోకుండానే పవన్ టీడీపీతో చేతులు కలపటం చాలామందిలో అయోమయం పెంచేస్తోంది. అంతిమంగా టీడీపీతోనే పవన్ పొత్తుపెట్టుకుంటారని అందరు అనుకుంటున్నదే. అయితే ఆ ముక్కేదో పవన్ బీజేపీకి చెప్పేసి విడిపోతున్నట్లు ప్రకటిస్తే అందరిలోను ఒక క్లారిటి వచ్చేస్తుంది. అప్పటిదాకా రఘురాజు లాంటి వాళ్ళకు టెన్షన్ తప్పదేమో.