హైదరాబాద్ : వీళ్ళ క్రెడిట్ వార్లో బకరాలైంది ఎవరో తెలుసా ?
సెప్టెంబర్ 17 వ తేదీ కార్యక్రమం పేరుతో బీజేపీ-టీఆర్ఎస్ మధ్య పెద్ద క్రెడిట్ వారే మొదలైంది. సెప్టెంబర్ 17వ తేదీని బీజేపీయేమో తెలంగాణా విమోచన దినోత్సవం పేరుతోను, టీఆర్ఎస్ జాతీయ సమైక్యతా దినోత్సవం పేరుతో చాలా ఓవరాక్షన్ చేశాయి. కార్యక్రమం ఒకటే అయినా రాజకీయ అనివార్యతల కారణంగా కేంద్ర-రాష్ట్రప్రభుత్వాలు రెండుపేర్లతో ఒకేరోజు నిర్వహించటమే చాలా విచిత్రంగా ఉంది.
ప్రత్యేక తెలంగాణా సమయంలో ఇదే కేసీయార్ తెలంగాణా విమోచన దినోత్సవాన్ని ఎందుకు నిర్విహించరని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వందలసార్లు డిమాండ్ చేసుంటారు. అప్పట్లో బీజేపీ కూడా ఇదే విషయమై నానా రచ్చచేసింది. అయితే తెలంగాణా ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ కు మిత్రపక్షం ఎంఐఎం విమోచన దినోత్సవానికి అడ్డంపడింది. అందుకనే గడచిన ఎనిమిదేళ్ళుగా అసలు ఈ దినాన్నే కేసీయార్ పట్టించుకోలేదు.
ఇదే సమయంలో ఎనిమిదేళ్ళుగా బీజేపీ కూడా ఏదో మొక్కుబడిగా డిమాండ్ చేసి వదిలేసింది. కానీ ఇపుడు మాత్రం చాలా పట్టుదలగా కేంద్ర హోంశాఖను ముందుపెట్టి విమోచన దినోత్సవం పేరుతో నానా హడావుడి చేసింది. కారణం ఏమిటంటే తొందరలో జరగబోయే ఎన్నికలే. ఇదే సమయంలో వేరేదారిలేక పరువు నిలుపుకునేందుకు కేసీయార్ కూడా విమోచన దినోత్సవాన్ని జాతీయ సమైక్యతా దినోత్సవం పేరుతో నిర్వహించారు. ఇక్కడే బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల రాజకీయం బయటపడింది.
వీళ్ళ రాజకీయం ఇలాగుంటే మధ్యలో కాంగ్రెస్, వామపక్షాలు బకరాలైపోయాయి. ఎందుకంటే అసలు నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటాలు చేసింది కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీలు. అయితే మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ తో మిత్రపక్షాలైన కారణంగా విమోచన దినోత్సవం జరపాలని కనీసం డిమాండుకూడా చేయలేనిస్ధితిలో వామపక్షాలు పడిపోయాయి. కేసీయార్ చేసిన చోద్యాన్ని కమ్యూనిస్టులు చూస్తూ కూర్చున్నారంతే. ఇదే పద్దతిలో కాంగ్రెస్ కూడా ఏమీ చేయలేక చేష్టలుడిగిపోయింది. నిజాంకు వ్యతిరేకంగా పోరాటాలు చేసిన పార్టీలు ఏమీమాట్లాడలేని స్ధితిలో పడిపోయాయి. అంటే బీజేపీ-టీఆర్ఎస్ మధ్యలో వామపక్షాలు, కాంగ్రెస్ బకరాలైపోయినట్లు అర్ధమైపోయింది.