ఎడా పెడా హామీలిస్తున్న జగన్.. చివరకు ఏమయ్యేనో..
ముందుగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డిని పిలిపించి మాట్లాడి శాంతింపజేశారు జగన్. బాలినేనికి జగన్ ఇచ్చిన హామీ ఏంటనేది ఇంకా బయటకు రాలేదు. అటు బాలినేని కూడా ఆ విషయంపై పెదవి విప్పలేదు. అయితే తాజాగా జగన్ ముగ్గురు అసంతృప్త ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఆ భేటీలో మాత్రం జగన్ వారికి స్పష్టమైన హామీ ఇచ్చి పంపించేశారని అంటున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, సామినేని ఉదయభాను, కొలుసు పార్థసారథితో సీఎం జగన్ వ్యక్తిగతంగా మాట్లాడారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం, మంత్రివర్గంలో మీకు చోటిస్తానని ఆ ముగ్గురినీ జగన్ బుజ్జగించినట్టు తెలుస్తోంది.
మంత్రి వర్గంలో స్థానం లేకపోవడంతో ఎమ్మెల్యేలు పిన్నెల్లి, సామినేని, కొలుసు.. ముగ్గురూ తీవ్ర స్థాయిలో తమ అసంతృప్తి వెళ్లగక్కారు. ఆ ముగ్గురి అనుచరులు ఆందోళనలకు దిగారు. దీంతో జగన్ నేరుగా స్పందించాల్సిన పరిస్థితి వచ్చింది. మాజీ మంత్రి బాలినేనిని నేరుగా బుజ్జగించిన జగన్, ఆ ముగ్గురిని కూడా అదే కోవలో పిలిపించుకుని మాట్లాడారు. సమస్యను చక్కదిద్దారు. అయితే సీఎం జగన్ ఇచ్చారని చెబుతున్న హామీ ఎంతవరకు నిజమో తేలాల్సి ఉంది. అదే నిజమైతే ఆయనపై మరింత ఒత్తిడి పెరిగే అవకాశముంది. ప్రస్తుతం మంత్రి వర్గం నుంచి పక్కనపెట్టిన 13మంది మరోసారి జగన్ అవకాశం ఇస్తారని ఎదురు చూస్తున్నారు. వారికి ఇప్పుడు మరో ముగ్గురు జతకలిశారు. అంటే 2024లో సీఎం జగన్ మంత్రి వర్గ కూర్పు విషయంలో మరింత కసరత్తు చేయాల్సి ఉంటుంది. అప్పటికి ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయాన్ని పక్కనపెడితే.. తాత్కాలిక హామీతో జగన్ ముగ్గుర్నీ బుజ్జగించడం మాత్రం విశేషమే.