కొత్త కేబినెట్: వైసీపీలో అసంతృప్తి తీవ్ర స్థాయిలో ఉందా..?
మంత్రి వర్గ కూర్పు విషయంలో సాధారణంగా ఏ పార్టీ అయినా ఒకటి రెండురోజుల ముందుగా లిస్ట్ బయటకు వదులుతుంది. అధికారికం అనుకోండి, అనధికారికం అనుకోండి.. లిస్ట్ అయితే బయటకొస్తుంది. కానీ విచిత్రంగా ఏపీలో మాత్రం అలాంటి పరిస్థితి లేదు. ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చాక మంత్రివర్గ ప్రమాణ స్వీకారం రోజే అందరికీ వారి పేర్లు తెలిశాయి. ఇప్పుడు సెకండ్ టీమ్ విషయంలో కూడా అదే గోప్యత పాటిస్తున్నారు జగన్.
అసంతృప్తి పెల్లుబుకుతుందా..?
ఇప్పటికే జగన్ అసంతృప్తుల్ని బుజ్జగించే పనిలో ఉన్నారు. మంత్రి పదవులు పోయినా, పార్టీ పదవులిస్తాం బాధపడొద్దని చెబుతున్నారు. ఎవ్వరికీ ప్రయారిటీ తగ్గదని, పార్టీకోసం పనిచేయాలని, తిరిగి గెలిచి వస్తే మీరే మంత్రులంటూ భరోసా ఇస్తున్నారు. ఈ భరోసా అనేది పెద్దగా పనిచేయదు, రెండేళ్లు అధికారం ఉండగానే మంత్రి పదవి తీసేస్తే ఎవరు మాత్రం సహిస్తారు చెప్పండి. కానీ వైసీపీలో మాత్రం సర్దుకుపోవాల్సిందే. ఉన్నఫళంగా మంత్రి పదవి తీసేస్తున్నారు, అయితే పనితీరులో ఎలాంటి వంక లేదని కవర్ చేస్తున్నారు. మరి పదవి ఎందుకు తీసేస్తున్నట్టు. పోనీ కొత్తవారి పేర్లయినా చెబుతున్నారా అంటే అదీ లేదు. ఉన్నవారిలో ఒకరిద్దరు, లేదా నలుగురు పదవుల్లోనే ఉంటారనే ప్రచారం కూడా ఉంది.
అంటే వారు సమర్థులన్నట్టే లెక్క, మిగతావారు సరిగా పనిచేయలేదా. ఆ మాట కూడా ఇక్కడ చెప్పడంలేదు. పదవుల్లో ఉంటారనుకున్నవారి గొప్పేంటి, పదవులు పోతున్నవారి తప్పేంటి అనే వాదన మొదలవుతోంది. దీంతో సహజంగానే పార్టీలో కొంత గందరగోళ వాతావరణం ఉంది. దీన్ని సర్దిపుచ్చుకోడానికి అధినాయకుడు తంటాలు పడుతున్నట్టు తెలుస్తోంది. అసంతృప్తి లేకుండా స్మూత్ గా మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ చేపట్టాలనేది జగన్ ఆలోచన. మరి కొత్త టీమ్ ని ప్రకటించిన తర్వాత నాయకుల నుంచి ఎలాంటి ప్రతిస్పందన వస్తుందో చూడాలి.