టార్గెట్‌ మోడీ: మంత్రులకు మాస్టర్ ప్లాన్ వివరించిన కేసీఆర్‌?

Chakravarthi Kalyan
కేంద్రంపై పోరాటానికి ఇప్పటికే సమర శంఖం పూరించిన తెలంగాణ సీఎం కేసీఆర్.. అందుకు మాస్టర్ ప్లాన్ రెడీ చేశారు. కేంద్రం మెడలు వంచేలా కార్యాచరణ సిద్ధం చేసిన కేసీఆర్‌ నిన్న దాన్ని తన మంత్రులకు వివరించారు. పెద్దఎత్తున ఆందోళనలతో తెలంగాణ తడాఖా చూపాలని.. ధాన్యం సేకరణ కోసం ఊరూరా తీర్మానాలు చేయాలని.. 2వ తేదీ తరువాత దిల్లీలో ధర్నాలు చేయాలని..
పార్లమెంటులోనూ నిరసనలు తెలపాలని సీఎం కేసీఆర్ మంత్రులకు తన ప్లాన్ హైలెట్స్ వివరించారు.

ఢిల్లీ వెళ్లి వచ్చిన మంత్రులు నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్‌, ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌లతో సీఎం కేసీఆర్ నిన్న భేటీ అయ్యారు. సుదీర్ఘంగా ఏడు గంటల పాటు ఈ సమావేశం జరిగిందంటే ఎంత డీప్‌గా చర్చించారో అర్థం చేసుకోవచ్చు. కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌తో చర్చల వివరాలను మంత్రులు కేసీఆర్‌కు తెలిపారు. మంత్రులకు తదుపరి కార్యాచరణ వివరించిన  ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ధాన్యం సేకరణపై కేంద్రం మొద్దునిద్ర వదిలించేందుకు పోరాటమే శరణ్యమని తెలిపారు.

మోడీ ఆధ్వర్యంలోని కేంద్రం ఇక  విన్నపాలను వినే పరిస్థితిలో లేదని తేల్చేశారు. ఇక కేంద్రంతో చర్చలు, వినతులు అవసరం లేదని.. తెలంగాణ తడాఖా చూపేలా సమర శంఖం పూరించాలని కేసీఆర్ మంత్రులతో అన్నారు. అందుకే యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేసిన కేసీఆర్ దాన్ని మంత్రులకు వివరించారు. అన్ని రూపాల్లోనూ కేంద్రంపై ఒత్తిడి పెంచుదామన్న కేసీఆర్.. పంజాబ్‌ తరహాలో ధాన్యం సేకరణ చేపట్టాలని అన్ని గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లాపరిషత్‌లు, రైతుబంధు సమితులు, మార్కెట్‌ కమిటీలు, ఆత్మ కమిటీలు, పురపాలక సంఘాల్లో తీర్మానాలు చేద్దామన్నారు.

వాటిని ప్రధాని మోదీకి పంపాలని.. పార్లమెంటులోనూ ఎంపీలు నిరసన తెలియజేస్తారని తెలిపారు. రాష్ట్రంలో దశల వారీగా ఆందోళనలు చేద్దామన్న కేసీఆర్.. వచ్చే నెల రెండో తేదీ తర్వాత దిల్లీకి వెళ్లి ధర్నా చేద్దామన్నారు. కేంద్రంపై పోరాటంలో ఇతర పార్టీల మద్దతు కూడా తీసుకోవాలని కేసీఆర్ నిర్ణయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: