పవన్ కల్యాణ్ కోసం నాదెండ్ల మాస్టర్ ప్లాన్..

Deekshitha Reddy
ఓవైపు పార్టీ, మరోవైపు సినిమాలతో బిజీగా ఉన్నారు పవన్ కల్యాణ్. దీంతో ఆయన పార్టీపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టలేకపోతున్నారు. అదే సమయంలో నాదెండ్ల మనోహర్, పవన్ కి బాగా సపోర్ట్ గా నిలిచారు. పార్టీ వ్యవహారాలన్నీ ఆయనే చూసుకుంటున్నారు. పోటీ, పొత్తులు వంటి కీలక నిర్ణయాలను పవన్ కి వదిలేసినా, కమిటీల ఏర్పాటు, సమావేశాలు, చర్చలు వంటివన్నీ నాదెండ్ల పూర్తి చేస్తున్నారు. దాదాపుగా పవన్ లేని సమయంలో నాదెండ్లే పార్టీ వ్యవహారాలన్నీ చక్కబెడుతున్నారు. అదే సమయంలో పవన్ కి మరింత ఆప్తుడిగా మారారు నాదెండ్ల.
మహిళా సాధికారత, ఆర్ధికాభివృద్ధే జనసేన పార్టీ లక్ష్యం అంటున్నారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. జనసేనలోని మహిళా ప్రాంతీయ కమిటీలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మహిళా విభాగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని వారికి వివహించారు. జనసేన సిద్ధాంతాలను మరోసారి వారికి గుర్తు చేశారు. ఆర్ధికంగా వెనకబడ్డ మహిళలు వారి సొంత కాళ్లపై నిలబడేలా.. వీర మహిళ విభాగం కృషి చేయాలన్నారు. మహిళా ఓటుబ్యాంకు పెంచుకోవాలంటే.. మహిళలతోనే సాధ్యమని చెప్పారు. అన్ని జిల్లాల్లోనూ వీర మహిళ విభాగాన్ని బలోపేతం చేస్తామని అన్నారు.
వీర మహిళలకు దిశా నిర్దేశం..
ముందుగా ప్రతి జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ నిర్వహించాలన్నారు నాదెండ్ల. జిల్లాలో ఒక్కో గ్రామాన్ని తీసుకుని, మహిళా సాధికారత, ఆర్ధిక అభివృద్ధికి.. జనసేన తోడ్పాటునిస్తుందన్నారు. తమ నాయకుడు పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు మహిళా శక్తిని పార్టీకోసం ఉపయోగించుకుంటామని, దానికోసం కార్యక్రమాలకు రూపకల్పన జరుగుతోందని చెప్పారు. ప్రతి జిల్లాలో జనసేన మహిళా కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. పార్టీకోసం నిస్వార్ధంగా పనిచేసే వీర మహిళలకు కమిటీ బాధ్యతలు అప్పగిస్తామన్నారు.
2024నాటికి బలమైన శక్తిగా..
వచ్చే ఎన్నికలనాటికి జనసేనను బలమైన శక్తిగా తీర్చిదిద్దుతామంటున్నారు నాదెండ్ల మనోహర్. ఇప్పటికే క్రియాశీల కార్యకర్తల నమోదు పార్టీకి బలాన్నిచ్చిందని, ప్రస్తుతం వీర మహిళ విభాగంపై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టామని చెప్పారు. జనసేనకు యువకుల బలం ఎక్కువగా ఉందని, అదే సమయంలో మహిళల సపోర్ట్ కూడా బాగా ఉండాలని ఆకాంక్షించారు నాదెండ్ల.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: