కాంగ్రెస్‌ : నేనూ ఉన్నానంటూ రేణుకాచౌదరి రచ్చ?

Chakravarthi Kalyan
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారం ఈ మధ్య మరీ కామెడీగా తయారైంది. కాస్త తెలంగాణలో ఆ మధ్య బలపడినట్టు కనిపించినా.. కొన్నిరోజులుగా అంతర్గత కుమ్ములాటలతో మరీ పలుచన అవుతోంది. అటు డిల్లీలోనూ కాంగ్రెస్ పరిస్థితి గ్రూప్ 23 కుంపట్లతో రగిలిపోతుంటే..ఇక్కడ హైదరాబాద్‌లో గ్రూప్ 10కుంపట్లు రాజుకుంటున్నాయి. ఇక ఇప్పుడు ఇవన్నీ చాలవన్నట్టు మరో సీనియర్ పొలిటీషియన్ యాక్టివ్ అవుతోంది. వచ్చీ రావడంతోనే గాండ్రిస్తోంది.

మరి ఇంతకీ ఈ సీనియర్ ఎవరనుకుంటున్నారా.. ఆమె ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి.. ఆమె తాజాగా ఖమ్మంలో స్పందిస్తూ.. తాను ఎక్కడ‌కు పోలేదని.. కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని గుర్తు చేస్తున్నారు. తాను నివురుగ‌ప్పిన నిప్పులా కాచుకోని కూర్చొని ఉన్నానని.. నేను ఉండ‌టం వ‌ల్ల కొంత మంది ఇబ్బంది ప‌డుతున్నారని తెలుసుకున్నానంటూ ఖమ్మం జిల్లాలోని కాంగ్రెస్ రాజకీయాలపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. వారితో ప‌ని చేపిద్దాం అని కాస్త ప‌క్కకు జ‌రిగానని.. తన స్వార్థం ఉంటే ఎన్నిక‌ల ద్వారా జిల్లా మార్చుకొనే దాన్నని కానీ.. తాను గెలిచినా, ఓడినా ఖ‌మ్మం జిల్లా ఆడ‌బిడ్డగానే ఉన్నానని అంటున్నారు రేణుకా చౌదరి.

ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోవ‌డం చాలా బాధించిందన్న రేణుక.. ప్రియాంక 170మీటింగ్ లు పెట్టినా ఫ‌లితం లేకుండా పోయిందని బాధపడిపోయారు. ఇది కాంగ్రెస్ పార్టీకి ఆత్మప‌రిశీల‌న చేసుకొనే స‌మ‌యమని అంటున్న రేణుక.. ఖ‌మ్మం జిల్లా కాంగ్రెస్ ఖిల్లా.. ఈ రెండేళ్లు న‌న్ను విభేదించే వారికి అవ‌కాశం ఇచ్చా.. స‌మాజంలో కొంత‌మంది చీడ‌పురుగులు ఉంటాయి.. ఖ‌మ్మం జిల్లా నుంచే ప్రభుత్వం పై తిరుగుబాటు మొద‌ల‌వుతుందని సమర శంఖం పూరించారు.

ప్రభుత్వంలో లోపాలు, అవ‌క‌త‌వ‌క‌లు చాలా ఉన్నాయని... పువ్వాడ అజ‌య్ కాదు కదా..ఆయ‌న బాబు కూడా నాకు తెలుసని అన్నారు రేణుకా చౌదరి.. తాను జిల్లాలో ఎవ‌డికి భ‌య‌ప‌డ‌నని.. నేను లేను అనుకుంటున్నారు.. నేను ఉన్నాను అని చెప్తున్నా.. రెండేళ్లలో చాలా మంది చాలా ప్రద‌క్షిణ‌లు చేశారు.. ఎటూ తిరిగి కాంగ్రెస్ కాంగ్రెస్ గూటికే చేరుతారు.. పుష్పా అంటే త‌గ్గేదే లే అన్నట్టు కాంగ్రెస్ అంటే సామాన్యమైన‌ది కాదని సెలవిచ్చారు రేణుకా చౌదరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: