గుడ్ న్యూస్: ఖాతాల్లో రూ.700 కోట్లు వేయనున్న జగన్?
ఈ పథకం కింద ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్స్ ఇస్తోంది. క్రమం తప్పకుండా త్రైమాసికం ఫీజును ఆ త్రైమాసికంలోనే చెల్లిస్తోంది. గత అక్టోబర్ – డిసెంబర్ 2021 త్రైమాసికానికి 10.82 లక్షల మంది విద్యార్థులకు గానూ రూ.709 కోట్లు నగదును సీఎం అందివ్వనున్నారు. ఇవాళ సచివాలయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి కంప్యూటర్ బటన్ నొక్కడం ద్వారా నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లోనే డబ్బు జమ చేయబోతున్నారు. ఇలా జగన్ సర్కారు జగనన్న విద్యా దీవెన పథకం కింద.. దేశంలో ఎక్కడా లేని విధంగా అర్హులైన పేద విద్యార్థులందరికీ.. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తోందని వైసీపీ నేతలు ఘనంగా చెప్పుకుంటున్నారు.
ఈ విద్యాదీవెన పథకం ద్వారా ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి కోర్సులు చదివే పేద విద్యార్థులు ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్ చేస్తోంది. కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజు మొత్తాన్ని విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తోందని వైసీపీ నేతలు చెబుతున్నారు. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా జగన్ సర్కారు విద్యారంగంలో మంచి పనులు చేస్తోందన్న పేరు సంపాదించుకుంది. సీఎం జగన్ విద్యావ్యవస్థలో పెను మార్పులు తీసుకొచ్చారని చెప్పాలి. ఆయన హాయాంలో ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మారిపోతున్నాయి. సీఎం జగన్ అమ్మఒడి, విద్యాదీవెన వంటి పథకాలు బాగా అమలు చేస్తున్నారు. అంతే కాదు.. ప్రభుత్వ పాఠశాలల్లోనూ కార్పొరేట్ తరహా వసతులను కల్పిస్తోంది.