మంత్రి హత్యకు కుట్ర కేసు.. ఆ బీజేపీ మహిళా నేత మెడకు?

Chakravarthi Kalyan
తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ హత్యకు రూ. 15 కోట్ల రూపాయలు సుపారీ ఇచ్చి ఒప్పందం కుదుర్చుకున్నారని.. దాన్ని పోలీసులు చేధించారని వచ్చిన వార్తలు ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాలను వేడెక్కించాయి. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌  హత్యకు కుట్ర పన్నిన అసలు సూత్రధారులు ఎవరు.. ఎవరికి ఆ అవసరం ఉంది.. అన్న కోణంలో దర్యాప్తు మొదలైంది.

అయితే.. నిందితులు ఢిల్లీలోని బీజేపీ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంట్లో ఆశ్రయం పొందడంతో ఇప్పుడు ఈ కుట్ర కేసులో ఆయన పాత్రపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ను హత్య చేస్తే రూ.15కోట్లు ఇస్తామని మధుసూదన్‌రాజు, అమరేంద్రరాజు సుపారీ గ్యాంగ్‌కు ఆఫర్‌ చేశారని పోలీసులు చెబుతున్నారు.

అంతే కాదు.. ఈ హత్యకు కుట్రలో జితేందర్‌రెడ్డి పాత్రపై కూడా ఎంక్వయిరీ చేస్తామన్నారు. అంతే కాదు.. ఈ హత్య కేసులో మాజీ మంత్రి డీకే అరుణ అనుచరులపైనా అనుమానాలు ఉన్నాయంటున్నారు పోలీసులు.. సాంకేతిక ఆధారాల ఆధారంగా ఈ కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన నాగరాజు.. ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి ఆయుధాలు కొనుగోలు చేసినట్టు తమ విచారణలో తేలిందని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు మొత్తం 8 మందిని పోలీసులు అరెస్టు చేశామని చెబుతున్నారు.

మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ హత్యకు కుట్ర కేసు నిందితులను కస్టడీలోకి తీసుకుంటామంటున్నారు పోలీసులు.. వారిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని.. ఆ  తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని సైబరాబాద్ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర మీడియాకు తెలిపారు. తెలంగాణలో అసలే బీజేపీ, టీఆర్ఎస్ మధ్య సంబంధాలు భగ్గు మంటున్న సమయంలో ఈ హత్య కేసు విచారణ మరింత సంచలనాత్మకంగా మారింది. ఈ కేసు విచారణను రాజకీయంగానూ ఉపయోగించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: