వైఎస్ వివేకా : చంద్రబాబు ఆరోపణల్లో నిజం ఎంత?
ఈ కథనంలో.. హత్య వెనుక నిజాలేంటి? సీబీఐ దర్యాప్తునకు ఉన్న అడ్డంకులేంటి? అవి కూడా తేలితే ఈ కథ సుఖాంతమే!
రాష్ట్ర రాజకీయాలను కదిపి కుదిపేస్తున్న పరిణామం వైఎస్ వివేకా హత్య.ఈ హత్యోదంతం జరిగిన తీరుపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి.సీబీఐకు కూడా జవాబుకు చిక్కని ప్రశ్నలు ఉన్నాయి. సమాధానాలకు అందని విధంగా పరిణామాలూ ఉన్నాయి.కావాలి ప్రశ్నలకే జవాబులు అని నిలదీయడానికి ప్రత్యర్థి పార్టీలూ ఉన్నాయి.ముందు నుంచి జగన్ బాబాయి హత్యకు సంబంధించి టీడీపీతోపాటు జనసేన కూడా స్పందిస్తోంది.కొన్నివిషయాలపై ట్రోల్స్ కూడా చేసింది.తన తండ్రి హత్యకు సంబంధించి సునీత ఇప్పటికే సీబీఐ దగ్గర ఇచ్చిన వాంగ్మూలం కూడా నిన్నటివేళ విపరీతంగా చర్చకు వచ్చింది.ట్రోల్ అయింది.
మొదట్నుంచీ ఆమె మాత్రం తనకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేస్తుందన్న నమ్మకం లేదని అంటున్నారు.ఈ దశలో కేసు దర్యాప్తు వేగం ఇప్పుడిప్పుడే పెరుగుతున్న నేపథ్యంలో సునీతకు అండగా షర్మిల కూడా సీన్ లోకి రానున్నారని సమాచారం.దీన్ని కేవలం తామొక ఇంటి వివాదంగా చూడలేమని,అత్యంత వివాదాస్పద ఘటనగానే దీనిని చూస్తామని టీడీపీ నేతలు పదే పదే అంటున్నారు.దీనిపై తమకు విమర్శలు చేయొద్దని వైసీపీ పెద్దలు ఎలా చెబుతారని నిజానిజాలపై మాట్లాడేందుకు తమకూ అవకాశం ఇవ్వమని టీడీపీ అంటోంది.తమ గొంతుకను నొక్కేయొద్దని కూడా విన్నవిస్తోంది.మరి! ఆ హత్య వెనుక ఉన్న నిజమేంటి? అందరూ అనుకుంటున్న రీతిలోనే ఓ ఎంపీ కారణంగానే ఇదంతా జరిగిందా? భూ వివాదాలే కారణమా? అన్న అనుమానాలూ మళ్లీ మళ్లీ వ్యక్తం అవుతున్నాయి విపక్షం నుంచి..! వీటిపై మాట్లాడాల్సినంత మాట్లాడేందుకు నిన్నటి వేళ డీజీపీ కూడా నిరాకరించారు.
కేసు దర్యాప్తులో ఉన్నప్పుడు నిబంధనలకు విరుద్ధంగా తానెలా మాట్లాడతానని మీడియాను ఎదురు ప్రశ్నించారు.ఇదే సందర్భంలో చంద్రబాబుతో పాటు లోకేశ్ కూడా సీన్ లోకి వచ్చారు. ఈ కేసులో వైసీపీ అధినేత జగన్ పూర్తిగా కూరుకు పోయారని అంటున్నారాయన. వివేకా హత్య కేసును ఆయన తప్పుదోవ పట్టిస్తున్నారని,ఆయన్ను కూడా సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇంతకూ ఇప్పటికిప్పుడు ఓ ముఖ్యమంత్రిని సీబీఐ విచారణ చేసేందుకు వీలుందా? చంద్రబాబు చెప్పిన విధంగా సీబీఐ విచారణకు సన్నద్ధం అయితే ఆ విధంగా టీడీపీ పొందే రాజకీయ లబ్ధి ఎంత అన్నవి వైసీపీ నుంచి వస్తున్న ప్రశ్నలు. కేసును టీడీపీ రాజకీయంగా వాడుకోవాలని చూస్తోందని వైసీపీ అంటోంది.ఆ రోజు బాలకృష్ణ ఇంట్లో కాల్పుల కేసులో తామెలా వ్యవహరించామో మరిచిపోవద్దని కూడా హితవు చెబుతోంది.ఈ నేపథ్యంలో జగన్ పై చంద్రబాబు చేసే ఆరోపణల్లో నిజమెంత అన్నది తేల్చాల్సింది దర్యాప్తు సంస్థలు,అంతేకాని నిజానిజాలు తెలియకుండా తెలుసుకోకుండా మాట్లాడే విపక్ష నేతల కారణంగా విష ప్రచారం జరుగుతుందే తప్ప ఒనగూరేదేమీ ఉండదని వైసీపీ అంటోంది.ఇదే సమయంలో చంద్రబాబు అనుకూల మీడియా తీర్పులు ఇవ్వడం మానుకోవాలని, తద్వారా కేసు దర్యాప్తు ఇంకాస్త వేగవంతం అయి పారదర్శక రీతిలో ఫలితాలు వస్తాయని వైసీపీ హితవు చెబుతోంది.ఇంతకూ ఈ హత్య వెనుక నిజమేంటి? వాంగ్మూలాలు పదే పదే ఎందుకు రికార్డు అవుతున్నాయి? అవి దర్యాప్తు అధికారులే తేల్చాలి.అందాక వెయిట్ అండ్ సీ....