బాబు కేబినెట్లో ఆ ఒక్క మార్పు తప్పదా.. !
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాబినెట్ పై రకరకాల చర్చలు వినిపిస్తున్నాయి. ఈసారి చంద్రబాబు అనూహ్యంగా తక్కువ మంది సీనియర్ల కు ... ఎక్కువ మంది కొత్త వాళ్లకు మంత్రి పదవులు కట్టబెట్టారు. ఇదంతా లోకేష్ టీమ్ గా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. లోకేష్ భవిష్యత్ రాజకీయం కోసం .. తన టీంను పటిష్టం చేసుకునే క్రమంలోనే ఎవ్వరూ ఊహించని విధంగా సరికొత్తగా కూర్పు ఉందన్న టాకే వినిపించింది. దీంతో కొంతమంది అనుభవ లేమి తో ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకువస్తున్నారని విమర్శలు కూడా ఉన్నాయి. మరి ముఖ్యంగా హోం మంత్రి వంగలపూడి అనిత అంచనాలు అందుకోవటం లేదని అంటున్నారు. అలాగే తొలిసారి ఎమ్మెల్యే గా గెలిచి.. అనూహ్యంగా మంత్రి అయిన వాసంశెట్టి సుభాష్ మరీ దూకుడుగా వెళుతున్నారన్న చర్చలు కూడా నడుస్తున్నాయి. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం హోమ్ శాఖ విషయంలో ఓపెన్ గానే తన అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కొంతమంది మంత్రులను తప్పించి కొత్త వారికి చోటు కల్పిస్తారని ప్రచారం గట్టిగా నడిచింది.
అయితే ఇంకా క్యాబినెట్ ఏర్పడి గట్టిగా ఏడు ఎనిమిది నెలలు కూడా కాలేదు. ఈ టైంలో మార్పులు చేర్పులు అంటే అది ప్రజల్లో ప్రభుత్వం పట్ల నెగిటివ్ సంకేతాలు వెళ్లినట్టు అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. ఇప్పటికి అయితే క్యాబినెట్లో మార్పులు చేర్పులు ఉండవని తెలుస్తోంది. అయితే ఖాళీగా ఉన్న ఒకే ఒక మంత్రిత్వ బెర్త్ ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్న నాగబాబుతో భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని మరోసారి బాబు క్యాబినెట్ లో మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. క్యాబినెట్లో మార్పులను ఆయన కొట్టి పడేశారు. బాబు క్యాబినెట్లో మార్పులు ఉండవని ఆయన తేల్చి చెప్పారు. అనవసర అనుమానాలకు చోటు ఇచ్చినట్టు అవుతుందని ఉద్దేశంతో ఆయన క్లారిటీ ఇచ్చేశారు. చంద్రబాబు క్యాబినెట్లో ప్రస్తుతానికి త్వరలోనే నాగబాబు ఎంట్రీ మాత్రం ఉండబోతుంది .. అది మినహా మరో ఏడాది వరకు ఎలాంటి మార్పులు చేర్పులు లేకపోవచ్చు.