ఉక్రెయిన్‌కు అండగా యుద్ధంలోకి ఆ రెండు దేశాలు..?
ఉక్రెయిన్‌కు ఆయుధాలు, ఇతర సామగ్రిని పంపుతామని జర్మనీ ప్రకటించింది. ఉక్రెయిన్‌కు వెయ్యి యాంటీ-ట్యాంక్ ఆయుధాలు పంపుతామన్న జర్మనీ... 500 స్టింజర్ క్షిపణులు కూడా పంపుతామని వెల్లడించింది. ప్రస్తుత క్లిష్ట సమయంలో ఉక్రెయిన్‌కు చేతనైనంత వరకూ సాయం అందిస్తామని జర్మనీ భరోసా ఇచ్చింది. అంతే కాదు.. పొరుగు దేశంపై విరుచుకు పడుతున్న రష్యాపై ఆర్థికంగా మరిన్ని ఆంక్షలు విధిస్తామని జర్మనీ హెచ్చరించింది.
ఉక్రెయిన్ కు పొరుగున ఉండే నెదర్లాండ్స్, ఈస్టోనియా నుంచి ఆయుధాలు తరలించేందుకు సహకరిస్తామంటోంది జర్మనీ. అంతే కాదు.. రష్యా విమానాలు తమ గగనతలం నుంచి వెళ్లకుండా జర్మనీ ఆంక్షలు విధించింది. ఇక జర్మనీ బాటలోనే తామూ ప్రయాణిస్తామంటోంది ఫ్రాన్స్. ఉక్రెయిన్‌కు అండగా పెద్దఎత్తున సైనిక సామగ్రిని ఉక్రెయిన్‌కు తరలిస్తామని ఫ్రాన్స్ ప్రకటించింది. జర్మనీ తరహాలోనే తాము కూడా రష్యాపై ఆర్థికపరమైన ఆంక్షలు తీవ్రతరం చేస్తామని ఫ్రాన్స్ రష్యాను హెచ్చరించింది.
ఇప్పటి వరకూ ఉక్రెయిన్ పై రష్యా విరుచుకుపడుతుంటే.. ఉక్రెయిన్ సైన్యాలు ఒంటరిగానే రష్యాను ఎదుర్కొంటున్నాయి. తమకు చేతనైంతలో పోరాడుతూనే ఉన్నాయి. రష్యా సేనలను ప్రతిఘటిస్తున్నాయి. అయితే.. ఇప్పుడు ఉక్రెయిన్ కు అండగా జర్మనీ, ఫ్రాన్స్ మందుకు రావడంతో యుద్ధంలో సీన్ మారబోతోంది. అయితే.. ఈ రెండు దేశాలు నేరుగా రష్యాతో తలపడే సాహసం చేయడం లేదు. ప్రస్తుతానికి ఆయుధాలను పంపుతున్నాయి. మరి ముందు ముందు ఈ యుద్ధం ఎన్ని ములుపులు తిరుగుతుందో చూడాలి.