బాలయ్య కోసం దిగొచ్చిన హిందీ భామ.. ఇక వరుస ఛాన్సులు ఖాయమేనా?

Amruth kumar
నటసింహం నందమూరి బాలకృష్ణ బాక్సాఫీస్ వద్ద సృష్టించే ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ‘వీరసింహారెడ్డి’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో బాలయ్య మళ్లీ చేతులు కలపడంతో, వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న ‘NBK111’ పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ చిత్రంలో ఉండబోయే ఒక స్పెషల్ సాంగ్ కోసం చిత్ర యూనిట్ ఒక భారీ ప్లాన్ సిద్ధం చేసింది.

బాలయ్య సినిమాల్లో యాక్షన్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో, స్పెషల్ సాంగ్స్ కూడా అంతే ఎనర్జిటిక్‌గా ఉంటాయి. ఈ సినిమాలో ఒక అదిరిపోయే మాస్ మ్యాన్ నంబర్ కోసం బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీని రంగంలోకి దించినట్లు సమాచారం. ‘రాక్‌స్టార్’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ భామ, ఇటీవల ‘హరిహర వీరమల్లు’లోనూ కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు బాలయ్య సరసన ఆడిపాడటానికి ఆమె సిద్ధమవ్వడం నందమూరి అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తోంది. ఈ స్పెషల్ సాంగ్ షూటింగ్‌ను హైదరాబాద్‌లోని ఒక భారీ సెట్‌లో మే 8 (రేపటి) నుంచి ప్రారంభించబోతున్నారు. ఈ పాటకు మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్. తమన్ అదిరిపోయే హై-ఎనర్జీ బీట్స్‌ను సిద్ధం చేశారని, బాలయ్య మార్క్ సిగ్నేచర్ స్టెప్పులు ఈ పాటకు హైలైట్‌గా నిలుస్తాయని తెలుస్తోంది.

ఈ సినిమా తారాగణం విషయంలో ఒక ఆసక్తికరమైన మార్పు చోటుచేసుకుంది. మొదట ఈ ప్రాజెక్టులో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటించాల్సి ఉంది. ఆమె పుట్టినరోజున అధికారికంగా పోస్టర్ కూడా విడుదల చేశారు. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల (డేట్స్ సమస్యలు మరియు ఇతర ప్రొఫెషనల్ రీజన్స్) ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.దీంతో మేకర్స్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ‘చందమామ’ కాజల్ అగర్వాల్ను కథానాయికగా ఎంపిక చేశారు. ‘భగవంత్ కేసరి’ సినిమాలో బాలయ్య-కాజల్ జోడీకి ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడ్డాయి. ఆ కెమిస్ట్రీని దృష్టిలో ఉంచుకుని దర్శకుడు గోపీచంద్ మలినేని మళ్లీ కాజల్‌ను ఖరారు చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే వీరిద్దరిపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.

ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట్ సతీష్ కిలారు అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. గోపీచంద్ మలినేని బాలయ్యలోని మాస్ యాంగిల్‌ను ఎంత పవర్‌ఫుల్‌గా చూపిస్తారో మనకు తెలిసిందే. ‘NBK111’లో కూడా అంతకు మించిన యాక్షన్, ఎమోషన్ మరియు మాస్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: