ఈఎన్ఈ రిపీట్ ట్రైలర్.. ఆకట్టుకున్న శ్రీనాథ్ మాగంటి
‘ఈ నగరానికి ఏమైంది’ (ENE) చిత్రం తెలుగు సినిమా పరిశ్రమలో యూత్‌ఫుల్ ఫ్రెండ్‌షిప్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. మొదటి భాగం విడుదలైన నాటి నుంచి నేటి వరకు ఈ సినిమాకి ఆడియెన్స్‌లో, ముఖ్యంగా యూత్‌లో ఉన్న క్రేజ్ మరియు ఫ్యాన్ బేస్ గురించి అందరికీ తెలిసిందే. ఇందులోని నలుగురు ప్రధాన పాత్రల మధ్య ఉండే కెమిస్ట్రీ, సహజమైన సంభాషణలు, స్నేహబంధం ప్రేక్షకులందరికీ బాగా కనెక్ట్ అయ్యాయి. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో మరియు రీ-రిలీజ్‌లలో కూడా ఈ చిత్రం అద్భుతమైన ఆదరణ పొందింది.
ఇప్పుడు ఈ క్రేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లేందుకు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీక్వెల్ ‘ఈ నగరానికి ఏమైంది 2’ (ENE 2) రూపంలో నలుగురు కుర్రాళ్ల గ్యాంగ్ మళ్లీ అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ సారి నలుగురి కుర్రాళ్లలో శ్రీనాథ్ మాగంటి ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోన్నారు. మొదటి భాగంలో ఆకట్టుకున్న ‘కార్తీక్’ పాత్రలో శ్రీనాథ్ మాగంటి తన నటనతో అందరినీ అలరించేందుకు పూర్తిస్థాయిలో రెడీగా ఉన్నారు. భారీ అంచనాల నడుమ ఈ ENE2 చిత్రాన్ని నవంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతోన్నారు.
సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రబృందం మంగళవారం నాడు ట్రైలర్‌ను అత్యంత వైభవంగా రిలీజ్ చేసింది. విడుదలైన కొద్దిసేపట్లోనే ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ట్రైలర్‌ను క్షుణ్ణంగా గమనిస్తే.. మొదటి భాగంలో ప్రేక్షకులు మెచ్చిన ఆ నాలుగు ముఖ్య పాత్రల చుట్టూనే కథ తిరుగుతుందని, ఈ సీక్వెల్‌లో కూడా ఆ నాలుగు పాత్రలే ప్రధాన హైలైట్‌గా నిలవబోతున్నాయని స్పష్టంగా అర్థమవుతోంది.
విశ్వక్ సేన్ తనదైన ఎనర్జీతో, అభినవ్ గోమటం తన మార్క్ టైమింగ్ అండ్ పంచ్ డైలాగ్స్‌తో, అలాగే వెంకటేష్ కూడా ఎప్పటిలానే తమ కామిక్ టైమింగ్‌తో ఆడియెన్స్‌ను విశేషంగా ఆకట్టుకున్నారనిపిస్తోంది. ఇక ఈ హిట్ గ్యాంగులో కొత్తగా చేరిన నటుడు శ్రీనాథ్ మాగంటి సైతం తన నటనతో అదరగొట్టేశాడు. సాధారణంగా ఇప్పటికే ఆడియెన్స్‌లో బాగా రిజిష్టర్ అయిన, ఐకానిక్‌గా మారిన ఒక పాత్రలోకి కొత్త నటుడు వచ్చి మెప్పించడం అంటే అంత తేలికైన విషయం కాదు. ప్రేక్షకుల అంచనాలు, పాత పాత్రతో పోలికలు ఎదుర్కోవడం పెద్ద సవాలు. అయితే, తాజాగా విడుదలైన ఈ ట్రైలర్‌ను చూస్తే మాత్రం శ్రీనాథ్ ‘కార్తీక్’ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయాడనిపిస్తోంది. ఎక్కడా కొత్తగా వచ్చిన భావన కలగకుండా, ఆ పాత గ్యాంగ్‌లో మొదటి నుంచి ఉన్న ఒకడిగా చాలా సహజంగా కలిసిపోయినట్లు కనిపిస్తోంది.
ట్రైలర్‌లో కార్తీక్‌గా శ్రీనాథ్ కామెడీ టైమింగ్, డ్రెస్సింగ్ అండ్ లుక్, స్క్రీన్ ప్రజెన్స్ అన్నీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నటుడిగా అతను తన పాత్రలోని అంతరార్థాన్ని, భావాన్ని పక్కాగా అర్థం చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఆ పాత్ర ఒక ఆధునిక పట్టణ యువకుడి మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుంది. సమాజం లేదా కుటుంబం ఆశించే సంప్రదాయ వృత్తిపరమైన ఎదుగుదల కంటే, తన వ్యక్తిగత అభిరుచిని ఎంచుకోవడం వల్ల ఎదురయ్యే మానసిక కాన్ ఫ్లిక్ట్స్, ఘర్షణల మధ్య అతడు నలిగిపోతుంటాడు. ఇటువంటి క్లిష్టమైన పరిణితి కలిగిన భావోద్వేగాలను, ఆ గ్యాంగ్‌లోని స్వేచ్ఛాయుతమైన, అల్లరితో కూడిన స్నేహబంధంతో సమతుల్యం చేయడం నటుడిగా అంత సులభమైన పని కాదు. కానీ, ఈ సీక్వెల్‌లో శ్రీనాథ్ మాగంటి ఆ వ్యత్యాసాన్ని ఎంతో చాకచక్యంగా ప్రదర్శిస్తూ కార్తిక్ పాత్రను ఓన్ చేసుకున్నట్లు కనిపించడం విశేషం.