ప్రతి ఒక్కరూ చూడాల్సిన ‘జయంత్ అండ్ ద జింగో పెన్’

Reddy P Rajasekhar


నటీనటులు: మాస్టర్ జయంత్ బొలిశెట్టి, ఊహా రెడ్డి, సత్యం రాజేష్, ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్, తనికెళ్ల భరణి, కాశీ విశ్వనాథ్ తదితరులు
దర్శకత్వం: నవీన్ దేశబోయిన
నిర్మాత: దివ్య ప్రవీణ్ బొలిశెట్టి
విడుదల తేదీ: నవంబర్ 14 (బాలల దినోత్సవం కానుకగా)
రేటింగ్: 3 / 5

కథ
స్కూల్లో లెక్కలంటేనే గడగడలాడిపోయే అల్లరి కుర్రాడు జయంత్ (జయంత్ బొలిశెట్టి). పిల్లల్ని నిత్యం భయపెట్టే లెక్కల మాస్టర్ హర్ష (సత్యం రాజేష్), జయంత్ అల్లరి వల్ల తరచూ తలవంపులు మూటగట్టుకునే పేరెంట్స్ (ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్)... ఇలా సాగిపోతున్న జయంత్ జీవితంలోకి అకస్మాత్తుగా ఒక ‘జింగో పెన్’ ప్రవేశిస్తుంది. అసలు ఆ మ్యాజికల్ పెన్ వెనుక ఉన్న ఫ్లాష్‌బ్యాక్ ఏంటి? తాతయ్య (తనికెళ్ల భరణి), ప్రిన్సిపాల్ (కాశీ విశ్వనాథ్)ల పాత్రల ప్రాధాన్యత ఏంటి? ఆ పెన్ సాయంతో జయంత్ తన భయాలను ఎలా జయించాడు? అనేది తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ
పిల్లలు బయటకు చెప్పుకోలేని ఒత్తిళ్లు, వారి అంతర్మథనం, గురువులు-తల్లిదండ్రుల ప్రభావం ఎలా ఉంటుందనే విషయాన్ని దర్శకుడు నవీన్ దేశబోయిన చాలా హృద్యంగా ఆవిష్కరించారు.ఫస్ట్ హాఫ్ - వినోదం: జయంత్ అల్లరి పనులు, ఫ్రెండ్స్ గ్యాంగ్ కామెడీ, దేవుడి గురించి అడిగే అమాయకపు ప్రశ్నలు, 'పేర్లు వేరైనా టేస్ట్ ఒకటే' లాంటి చక్కటి డైలాగ్స్‌తో ప్రథమార్థం సరదాగా సాగిపోతుంది.సెకండాఫ్ అంతా భావోద్వేగాల చుట్టూ తిరుగుతుంది. జింగో పెన్ ఎంట్రీ తర్వాత కథలో వేగం పుడుతుంది. స్కూల్ బస్ ప్రమాదం, ఊహ హాస్పిటల్ ఎపిసోడ్, 'ఓటమిని కూడా సెలెబ్రేట్ చేసుకోవాలి' అనే పాయింట్లు సినిమాను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తాయి. తాత-మనవడి బంధం కంటతడి పెట్టిస్తుంది. చివర్లో తండ్రి చెప్పే మాటలు, పిల్లాడిలో వచ్చే మార్పు మనసుకి ఎంతో ప్రశాంతతను ఇస్తుంది.

నటీనటులు, సాంకేతిక విభాగం
మాస్టర్ జయంత్తొలి సినిమానే అయినా నటనలో పరిపక్వత చూపించి, నవ్విస్తూనే ఆలోచింపజేశాడు. సత్యం రాజేష్ లెక్కల మాస్టర్‌గా, ఆశిష్ గాంధీ నిజాయితీగల తండ్రిగా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. బేబీ ఊహ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఊహ ఆకట్టుకుంటే, తాత పాత్రలో భరణి గారు హార్ట్ టచింగ్‌గా నటించారు. పిల్లలు అందరూ తమ తమ పాత్రల్లో అందంగా కనిపించారు, నటనతో మెప్పించారు.

ప్రవీణ్ బొలిశెట్టి మ్యూజిక్, పాటలు కథకు ప్రాణం పోశాయి. కెమెరా వర్క్, ఉన్నతమైన నిర్మాణ విలువలు సినిమా రిచ్‌నెస్‌ను పెంచాయి. దివ్య ప్రవీణ్ బొలిశెట్టి తొలి ప్రయత్నంలో ఓ మంచి సినిమాని, హృద్యమైన చిత్రాన్ని ప్రేక్షకులకు అందించడంలో సక్సెస్ అయ్యారు.

ఎలాంటి అసభ్యతకు తావులేకుండా, పిల్లలు-పెద్దలు అందరూ హాయిగా నవ్వుకుంటూ, కొన్ని మంచి విషయాలు నేర్చుకుంటూ థియేటర్ నుంచి బయటికి వచ్చే అచ్చమైన క్లీన్ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘జయంత్ అండ్ ద జింగో పెన్’!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: