రాయలసీమ : అవినాష్ కు బంధువులతోనే పడటంలేదా ?
వివేకానంద హత్యకేసు చిత్ర విచిత్రమైన మలుపులు తిరుగుతున్నాయి. వివేకా ఇంట్లో పనిచేసిన వారిలో రోజుకొకరి వాంగ్మూలం అంటు ఎల్లోమీడియాలో ప్రత్యక్షమవుతోంది. ఎన్ని మలుపులు తిరిగినా, ఎంతమంది వాంగ్మూలాలు వినిపిస్తున్నా కామన్ పాయింట్ ఏమిటంటే కడప ఎంపీ అవినాష్ రెడ్డిదే కీలకపాత్రగా ఎస్టాబ్లిష్ చేయటం. వివేకా హత్యలో ఎవరి పాత్ర ఎంతన్నది సీబీఐ దర్యాప్తు మీద ఆధారపడుంది. అలాగే దాన్ని సాక్ష్యాధారాలతో కోర్టులో సీబీఐ నిరూపించాల్సుంటుంది.
సరే వివేకా హత్య విషయాన్ని కాసేపు పక్కనపెడితే వైఎస్ కుటుంబంలోనే ఎంపీ అవినాష్ అంటే పడని వాళ్ళున్నట్లు స్పష్టంగా అర్ధమవుతోంది. చాలామంది జనాలకు వైఎస్ కుటుంబంలో ఎంతమందున్నారు ? ఎవరేం చేస్తున్నారనే విషయాలు కూడా తెలీదు. అలాంటిది వివేకా హత్య కేసులో చాలామందిని సీబీఐ విచారిస్తోంది. సీబీఐకి వాళ్ళిచ్చిన వాంగ్మూలాల వివరాలు చూస్తుంటే అందరి చెప్పింది అవినాష్ కు వ్యతిరేకంగానే అనిపిస్తోంది.
ఎంపి సొంత పెదనాన్న వైఎస్ ప్రతాప్ రెడ్డి, డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి వాంగ్మూలాలు గమనిస్తే హత్యలో ఎంపీకి కీలక పాత్రున్నట్లు ఎవరికైనా అనుమానాలు వచ్చేస్తాయి. ఇప్పటికే వివేకాకు డ్రైవర్ గా పనిచేసిన దస్తగిరి వాంగ్మూలంలో అవినాష్ రెడ్డే సూత్రదారని చెప్పాడంటు విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో ఎంపీకి మద్దతుగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మద్దతుగా చాలా మాట్లాడుతున్నారు. అయితే సజ్జల వాదనకన్నా దస్తగిరి, ప్రతాపరెడ్డి, అభిషేక్ రెడ్డి వాంగ్మూలాలే ఎక్కువ వైరల్ అయ్యాయి.
నిజానికి డాక్టర్ అభిషేక్ రెడ్డి డైరెక్టుగా అవినాష్ పై ఏమీ చెప్పలేదు. అయితే మంచంమీద పడున్న వివేకా దేహాన్ని చూసిన తర్వాత ఎవరికైనా చంపేశారనే విషయం తెలిసిపోతుందన్నారు. అలాంటిది టీవీల్లో గుండెపోటుతో చనిపోయాడని హల్ చల్ ఎలా చేశారో అర్ధం కావటంలేదన్నారు. పైగా తాను గదిలో మృతదేహాన్ని చూసి బయటకు వచ్చేటప్పటికి అవినాష్ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతుంటే పక్కన ఎర్రగంగిరెడ్డి, డీ. శివశంకరెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి మరికొందరున్నట్లు చెప్పాడు.
వివేకా గుండెపోటుతో మరణించినట్లు అవినాషే అందరికీ చెప్పాడనే ఆరోపణలకు ఇప్పటికే విస్తృతంగా ప్రచారంలో ఉంది. బయట వాళ్ళు ఎన్ననైనా చెప్పవచ్చు కానీ చివరకు సొంత బంధువుల వాంగ్మూలాలు కూడా అవినాష్ కు వ్యతిరేకంగానే ఉండటమే ఆశ్చర్యంగా ఉంది. అంటే దగ్గర బంధువుల్లోనే ఎంపీ అంటే పడనివాళ్ళున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.