బడ్జెట్ 2022 : జగన్ అడగరు? అత్తతో తగువెందుకని!
ఏటా కేంద్ర బడ్జెట్ నుంచి మనం ఆశించేదేమీ ఉండదు ఎందుకంటే మనం కోరుకున్నా,కోరుకోకపోయినా పన్నుల సర్దుబాటు తప్ప మన దగ్గరకు పెద్దగా నిధులు రావు. ఉత్తరాదిలో ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో వాళ్లకే నిధులు విదిల్చి మనకు బూడిద అంటిస్తారేమోనన్న అనుమానాలను ప్రబలంగా ఉన్నాయి ఆర్థిక నిపుణుల్లో! ఈ దశలో కేంద్రాన్ని ఒత్తిడి చేయడం కాదు కదా! కనీసం ఓ లేఖ రూపంలో కూడా అడిగేందుకు యువ ముఖ్యమంత్రి ఆసక్తి చూపడం లేదు.
ఇదే సమయంలో పక్క రాష్ట్రం అయిన తెలంగాణ ఇప్పటి నుంచే అస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది.లేఖల మీద లేఖలు రాస్తోంది. తమకు రావాల్సిన నిధులు ఇవ్వకుండా సమాఖ్య స్ఫూర్తిని బీజేపీ సర్కారు చెడగొడుతుందని అంటోంది.ఇదే సమయంలో లేఖలతో పాటే ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ కూడా నడుపుతోంది.ఇవేవీ పట్టని మనకు నిధులు ఎలా వస్తాయి? సాయిరెడ్డి,మిథున్ రెడ్డిలాంటి పెద్దలారా! ఓ సారి ఆలోచించండి.
రెండే రెండు హామీలపై కేంద్రాన్ని నిలదీయాల్సిన ఆవశ్యకత ఉంది.ఒకటి ప్రత్యేక హోదా రెండు రైల్వేలకు సంబంధించి ప్రత్యేక జోను. ఈరెంటిపై కేంద్రం ఇప్పటిదాకా కప్పదాటు వ్యవహారమే తప్ప స్పష్టం అయిన విధానాన్నివెలువరించిన పాపానికి పోలేదు.కేంద్రంతో కయ్యం పెట్టుకుంటే మనం నెగ్గలేం ? అన్న ఆలోచన ఒకటి జగన్ కు ఉంటే ఎవ్వరూ ఏమీ చేయలేరు.. ఎందుకంటే మనవైపు నుంచి ఒత్తిడి లేకుండా మన తరఫు నుంచి వాదన లేకుండా కేంద్రం నుంచి సాయం కాదు కదా! హక్కుగా రావాల్సిన వాటిని కూడా దక్కించుకోవడం అన్నది ఇవాళ అసాధ్యం.