యూపీ : ఓటు బ్యాంకు రాజకీయాల్లో గెలుపు ఎవరిది?
ఎస్పీ తరఫున అఖిలేశ్ యాదవ్ ఉన్నారు.ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నారు. ముఖ్యంగా బీజేపీ ఓటు బ్యాంకును చీల్చేందుకు తనవంతు ప్రయత్నం తాను చేస్తున్నారు.అయితే ఎప్పటిలానే ఈ ఎన్నికల్లో బీజేపీ నుంచి కానీ ఎస్పీ నుంచి కానీ మహిళలకు దక్కిన ప్రాధాన్యం అంతంత మాత్రమే! కానీ కాంగ్రెస్ వినూత్నంగా సామాజిక కార్యకర్తలకు టిక్కెట్లు ఇచ్చి ఇప్పటిదాకా ముందంజలోనే ఉంది. అయితే వీరు గెలుస్తారా లేదా ఓడిపోతారా అన్న వాదన అటుంచితే కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంపై ఓ విధంగా ఓటర్లలో సానుకూలత ఉంది. ఇది ఓటు బ్యాంకు రాజకీయాలను ప్రభావితం చేస్తుందో లేదో అన్నది ఇప్పటికప్పుడు తేల్చలేం.
ఇక మహిళలు తరువాత దళితులు ఇక్కడ అత్యధిక స్థాయిలో ప్రభావితం చేయనున్నారని తేలింది. 15 కోట్లకు పైగా ఉన్న ఓటర్లలో దళితులు 21శాతం మంది ఉన్నారు అని అంటే 3.15 కోట్ల మంది దళితుల కారణంగా నాయకుల జాతకాలే మారిపోనున్నాయని తెలుస్తోంది.అందుకే ఎస్పీ కానీ బీఎస్పీ కానీ కులం ప్రధానంగా నడిపే రాజకీయాలను అత్యధికంగా నమ్ముకుంటున్నాయి అని, మతం ప్రాతిపదికగా బీజేపీ తో పాటు ఎస్పీ కూడా ఈ సారి ఇలాంటి లాజిక్కులేవో తెరపైకి తెస్తున్నది.
కృష్ణుడు తనకు కల్లోకి వచ్చి రామ రాజ్యం స్థాపించమన్నాడని చెప్పి ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ చెప్పిన మాటలను అప్పుడే మరిచిపోలేం కూడా! అయితే ములాయంకు ఇంటి పోరు ఉంది.ఆయన చిన్న కోడలు బీజేపీలో చేరిపోయారు. ఇంకా ఇంకొందరు కూడా బీజేపీ సానుభూతి పరులగానే ఉన్నారు.ఎస్సీలు ప్రభావితం చేసే రిజర్వుడు స్థానాలు 84 ఉన్నాయని ఇందులో 68 శాతానికి మించి సీట్లు తెచ్చుకున్న పార్టీకే అధికారం దక్కుతుందని ప్రధాన మీడియా వెల్లడిస్తున్నది.
ఎస్సీ నియోజకవర్గాలకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి
- భారతీయ జనతా పార్టీకి సంబంధించి 2007లో 7 సీట్లు, 2012లో 3 సీట్లు 2017 లో 70 సీట్లు వచ్చాయి.
- సమాజ్ వాదీ పార్టీకి సంబంధించి 2007లో 13 సీట్లు, 2012లో 59 సీట్లు, 2017లో 7 సీట్లు వచ్చాయి.
- బహుజన్ సమాజ్ వాదీ పార్టీకి సంబంధించి 2007లో 61 సీట్లు, 2012లో 14 సీట్లు, 2017లో 2 సీట్లు వచ్చాయి.
- కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 2007లో 5 సీట్లు, 2012లో 4 సీట్లు వచ్చాయి.2017లో బోణీలే లేవు.
- రాష్ట్రీయ లోక్ దళ్ కు సంబంధించి 2007లో 1 సీటు రాగా, 2012లో 3 సీట్లు వచ్చాయి.2017లో బోణీలే లేవు.