గుడ్‌న్యూస్‌: దేశంలోనే ఏపీ ఫస్ట్‌, తెలంగాణ సెకండ్‌..?

Chakravarthi Kalyan
సంక్రాంతి ప్రకృతి పండుగ.. పంటలు ఇంటికి వచ్చే సమయంలో వచ్చే పండుగ. ఇలాంటి శుభ సమయంలో కేంద్రం విడుదల చేసిన ఓ నివేదిక తెలుగు రాష్ట్రాలకు ఆనందం పంచింది. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ  విడుదల చేసిన 2021 అటవీ సర్వే నివేదికలో అటవీ విస్తీర్ణం పెరుగుదల విషయంలో తెలుగు రాష్ట్రాలు దేశంలోనే అగ్రగాములుగా నిలిచాయి. కేంద్ర అటవీ, పర్యావరణ  మంత్రి  భూపేందర్‌ యాదవ్‌ ఈ నివేదికలు విడుదల చేశారు.
 
గతేడాది అటవీ విస్తీర్ణంలో గరిష్టంగా ఆంధ్రప్రదేశ్‌లో 647 చ.కి.మీల విస్తీర్ణం పెరిగిందట. రికార్డు స్థాయి పెరుగుదలతో ఏపీ దేశంలోనే ఫస్ట్ ప్లేస్‌ కొట్టేసింది. అలాగే  తెలంగాణ  632 చ.కి.మీ విస్తీర్ణంతో రెండో స్థానం సంపాదించింది. మన పొరుగునే ఉన్న ఒడిశా 537 చ.కి.మీ. నమోదు చేసి మూడో స్థానంలో నిలిచింది. 2019 తర్వాత అటవీ విస్తీర్ణం పెరుగుదలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రభాగాన నిలిచింది.  రెండో స్థానంలో తెలంగాణ, మూడో స్థానంలో ఒడిశా ఉన్నాయి.

మొత్తం దేశంలోని 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అటవీ విస్తీర్ణంలో ఉన్న భౌగోళిక ప్రాంతంలో 33 శాతానికి పైగా అటవీ విస్తీర్ణం నమోదైంది. దేశంలోని మొత్తం అడవులు, చెట్ల విస్తీర్ణంలో గత రెండేళ్లలో 2,261 చదరపు కిలోమీటర్ల పెరుగుదల నమోదైంది. ఇక రాష్ట్రాల వారీగా చూస్తే.. దేశంలోనే అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన రాష్ట్రంగా ఇప్పటికీ మధ్యప్రదేశ్ ఫస్ట్ ప్లేస్‌లో కొనసాగుతోంది.

దేశంలో మొత్తం మడ అడవుల విస్తీర్ణం 4,992 చ.కి.మీగా నమోదైంది. మడ అడవుల విషయంలో  2019 నుంచి 17 చ.కి.మీ పెరుగుదల నమోదయ్యిందని కేంద్ర అటవీ శాఖ తెలిపింది. అడవులను పరిమాణాత్మకంగా సంరక్షించడం మాత్రమే కాకుండా వాటిని గుణాత్మకంగా సుసంపన్నం చేయడంపై కేంద్రం ప్రభుత్వం దృష్టి పెట్టిందని మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. దేశంలోని అడవులలో మొత్తం కార్బన్ స్టాక్ 7,204 మిలియన్ టన్నులు ఉండగా.. 79.4 మిలియన్ల పెరుగుదల నమోదైనట్టు అటవీ సర్వే అంచనా వేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: