మెగా జగన్ : లంచ్ మీట్ లో ఏం తేలనుంది?
రాజకీయంగా చూస్తే జగన్ కు చిరు ఓ విధంగా దగ్గర మరో విధంగా దూరం..ఆ రోజు వైఎస్సార్ ప్రభుత్వానికి బాహాటంగా మద్దతిచ్చి
వెన్నుదన్నుగా ఉన్నది చిరంజీవే! ఆ తరువాత పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం మేరకు పీఆర్పీ విలీనం అయినా కూడా చిరంజీవి ఎక్కడా మరీ అంత క్రియాశీలకంగా ఉండలేకపోయారు.రాజ్య సభ సభ్యునిగా కూడా చిరంజీవి ప్రభావం అంతంత మాత్రమే అయినా పొలిటికల్ స్పీచులలో ఎక్కడా విమర్శలకు తావివ్వకుండా జాగ్రత్త వహించారు. ఆ విధంగా తమ్ముడు పవన్ పార్టీ పెట్టి విమర్శించినా కూడా జగన్ ను మాత్రం చిరంజీవి ఏమీ అనలేదు. అనబోరు కూడా! కనుక ముందున్న కాలంలో చిరంజీవి, జగన్ కలిసి పనిచేసేందుకు వైసీపీకి స్టార్ క్యాంపైనర్ గా ఉండేందుకు చిరు రెడీ అంటారేమో!
ఇండస్ట్రీ పెద్ద ఎవరు అన్న అనవసర రాద్ధాంతం మినహా మిగతాదంతా ఆలోచిస్తే ఎప్పటి నుంచో జగన్ ను కలవాలని భావిస్తున్న చిరు ఈ సారి అందుకు సరైన ముహూర్తం నిర్ణయించుకున్నారు. వైకుంఠ ఏకాదశి రోజున చర్చలకు ద్వారాలు తెరిచి స్వాగతిస్తున్నారు జగన్. ఈ నేపథ్యంలో ఇవాళ ఆంధ్రావనిలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకోనున్నాయి.యువ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని మెగాస్టార్ చిరంజీవితో భేటీ కానున్నారు.ఇందుకు సంబంధించి లంచ్ మీట్ ఒకటి ఏర్పాటు చేశారు.ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యలపై మాట్లాడేందుకు అదేవిధంగా టికెట్ ధరల తగ్గింపు ఇప్పుడున్న నిర్ణయాన్ని పునః సమీక్షించేందుకు చర్యలు తీసుకోనున్నారు.చిరు - జగన్ భేటీపై ఇండస్ట్రీ మొత్తం ఆశలు పెట్టుకుంది. రేపు సోగ్గాడే సీక్వెల్ బంగార్రాజు విడుదలవుతున్నందున టికెట్ ధరలకు సంబంధించి ఈ ఒక్క సంక్రాంతికి ఏమయినా సడలింపు ఇస్తారా అన్న దిశగా ప్రతిపాదనలు కదులుతున్నాయి. అందుకు అనుగుణంగానే పరిణామాలు ఉంటాయని అంతా ఆశిస్తున్నారు.