ఒక్కో రాష్ట్రం ఒక్కోలా.. కరోనా దృష్ట్యా కఠిన ఆంక్షలు..?
దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తున్న దృష్ట్యా కరోనా నిబంధనలను రాష్ట్రాలు మరింత కఠినతరం చేస్తున్నాయి. ఇప్పటికే దిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాలు కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నాయి. ఇక కరోనా కట్టడికి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. ఆ రాష్ట్రంలో
ఆదివారం రాత్రి నుంచి రాత్రి కర్ఫ్యూ అమలుకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. అలాగే జనవరి 16 వరకూ విద్యాసంస్థలను యూపీ సర్కారు మూసివేసింది.
మరోవైపు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయ పనిదినాలను తగ్గించింది. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఐదు రోజులు 50శాతం సిబ్బందితో కార్యాలయాలు నడపనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో వారంతపు కర్ఫ్యూ అమలవుతోంది. ఇలాంటి ఆంక్షలతో
అనేక ప్రధాన నగరాలు, రహదారి కూడళ్లు నిర్మానుష్యంగా మారాయి. ఈ నేపథ్యంలో మళ్లీ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించే అవకాశాలను కూడా కేంద్రం పరిశీలిస్తున్నా అది ఆఖరి అవకాశంగానే చూడాలి భావిస్తోంది.
అయితే.. ఢిల్లీలో ప్రజలు మాస్కులు పెట్టుకుంటే లాక్‌డౌన్ పెట్టబోమని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. కరోనా నుంచి కోలుకున్న ఆయన ఇవాళ ఢిల్లీలో కరోనా పరిస్థితిపై సమీక్ష నిర్వహించబోతున్నారు. ఢిల్లీలో లాక్‌డౌన్ పెట్టే ఉద్దేశ్యం ప్రస్తుతానికి లేదని అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. ఈ థర్డ్ వేవ్‌లో మరణాలు సంఖ్య చాలా తగ్గిందన్న ఆయన.. దీనిపై భయపడాల్సిన పనేమీ లేదన్నారు. అయితే.. తగిన జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.