ఫోకస్ టాపిక్ : ఆజ్ కా రాజ్ గూండారాజ్ ?
బెజవాడ గూండాలు మరీ బిజీగా ఉన్నారు సర్, వారి జోలికి పోవొద్దు. అందుకే ఎయిమ్ ఈ సారి పెద్ద పెద్ద నాయకులపై దృష్టి పెట్టారు. ఆ విధంగా ఈ సారి పాత బెజవాడ తగవులు అన్నీ బయటకు వస్తున్నాయి. వంగవీటి రాధా పై రెక్కీ నిర్వహించడం కూడా ఇలాంటిదే! కానీ ఈ సారి దేవినేని అవినాశ్ మనుషులు ఈ ప్రక్రియకు ఈ రాద్ధాంతానికి పూనుకున్నారని కొందరు అంటున్నారు. అభియోగాలు నిరూపణ అవ్వనంత వరకూ అంటున్నారు అనే రాయాలి. ఇక రాద్ధాంతం చల్లారక మునుపే కొత్త ఏడాది పరుగు పరుగున వస్తోంది. కొత్త తగువులు ఏవీ లేకుండా ఉంచు తండ్రీ అని దేవుడ్ని వేడుకోవడం మినహా ఏంచేయాలి.
తాజాగా ఈ తగువులు ఇప్పట్లో తేలవు కానీ ఈ ఏడాది కడప గూండాలూ బాగానే రెచ్చిపోయారు. సెటిల్మెంట్ రాజకీయాలు బాగానే చేస్తున్నారు. కనుక వీరిని కూడా మనం ఏమీ అనవద్దు. అదేవిధంగా శ్రీకాకుళం లాంటి ప్రాంతాలలో కూడా మంచి ల్యాండ్ సెటిల్మెంట్లకు వైసీపీ నాయకులు వీలున్నంత వరకూ ప్రోత్సాహం అందించి నోట్ల కట్లను బహుమతి గా అందుకుంటున్నారని ఓ సమాచారం. అభియోగం కూడా!
వీటితో పాటు ఒంగోలు రౌడీలు వారితో పాటు చాలా మంది రౌడీలు ఈ ఏడాది విఖ్యాత రీతిలో వార్తల్లోకి ఎక్కించిన ఘనత కూడా దౌర్భాగ్యపు మీడియాదే! బాలినేని శ్రీనివాస్ రెడ్డి (వాసన్న) కు సంబంధించి అనుచరుల కొట్లాట ఒకటి రచ్చకెక్కింది. పోలీసుల ఎస్కార్టు వెహికల్ లో వచ్చి మరీ! రౌడీలు హల్ చల్ చేశారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడాడు అన్న ఒకే ఒక్క కారణంతో సుబ్బారావు గుప్తా ను విచక్షణా రహితంగా కొట్టి ఆఖరికి అతనితో క్షమాపణలు చెప్పించి విషయాన్ని చాలా స్థాయికి తీసుకుని పోయారు బాలినేని మరో అనుచరుడు సుభాన్.. ఇంకా గూండాలు చాలామంది ఉన్నారు. వాళ్లందరికీ ఖాకీలే ఎస్కార్టులు.