సుదీర్ఘ చరిత్ర ఉన్న పార్టీని మట్టి కరిపించాం అన్న ఆనందంలో టీడీపీ ఒకప్పుడు ఉంది. అందుకు కారణాలు ఏమయినా ఆ రోజు రారాజు లాంటి కాంగ్రెస్ కు చుక్కలు చూపించారు తెలుగుదేశం పార్టీ నాయకులు. తరువాత పరిణామాల నేపథ్యంలో రాష్ట్రం విడిపోయాక అదే టీడీపీ అదే కాంగ్రెస్ నుంచి పుట్టిన పిల్ల కాంగ్రెస్ చుక్కలు చూపించింది. అదే విడ్డూరం కూడా! ఎందుకంటే అసలు జగన్ అనే వ్యక్తి సీఎం కాబోరని, ఆయనకు ఆ సత్తా లేదని ఎన్నో సార్లు చెప్పిన టీడీపీ నాయకులే ఆఖరికి ఆయన పంచన చేరి భజన చేయడమే విడ్డూరం. పీసీసీ అధ్యక్ష హోదాలో ఉంటూ ఆ రోజు అనేక ఆరోపణలు చేసిన బొత్స సత్యనారాయణే తరువాత కాలంలో ఆయన దగ్గర పదవులు పొందడం విడ్డూరం. కాల గతిలోచంద్రబాబు అనే లీడర్ ను వైసీపీ బాగానే ఎదుర్కొంది.
చెప్పేంత అభివృద్ధి లేకపోయినా, వైసీపీ మాత్రం తెలుగుదేశాన్ని మట్టికరిపించడంలో మాత్రం బాగానే సక్సెస్ అయింది. ఈ దశలో వైసీపీ చేసిన ప్రతి పనీ సఫలీకృతం అయింది. చంద్రబాబు సొంత మనుషులే వైసీపీకి సహకరించడం కూడా చాలా అంటే చాలా విడ్డూరం. కులం అంటే విపరీతం అయిన అభిమానం, ప్రేమ, ఆదరం బాగా ఉండే ప్రాంతాలు ఆ రెండే (కృష్ణ, గుంటూరు) జిల్లాల నేతలు వైసీపీకి బాగా సహకరించడం మరో వింత మరియు విశేషం. ఆఖరికి ఆరెండు పత్రికలూ కాస్త తగ్గాయనే అనాలి. అనగా ఈనాడు మరియు ఆంధ్రజ్యోతి కూడా! కాస్తో కూస్తో ఏబీఎన్ తో రాజకీయం చేయిస్తున్న చంద్రబాబు ఆ పాటి మాటలు చెప్పించడంలో మాత్రం సఫలీకృతం అయ్యారేమో కానీ రాజకీయంగా జగన్ ను అస్సలు ఢీ కొనలేక డీలా పడ్డారు. ఆఖరికి కుప్పంలో కూడా గెలవలేక చతికిల పడ్డారు. అయినప్పటికీ టీడీపీ మళ్లీ పుంజుకోలేదని అనలేం..ఆ విధంగా అనడంతప్పు కూడా! రాజకీయంలో ఏమయినా జరగవచ్చు కనుక ఆ మార్పునకు దగ్గరగా చంద్రబాబు రాజకీయం చేస్తే మేలు.
అధికార పార్టీ మీడియా చెబుతున్న లెక్కల ప్రకారం
మున్సిపల్ ఎన్నికల్లో 74 - వైసీపీకి
1 - టీడీపీకి దక్కాయి
కార్పొరేషన్ ఎన్నికల్లో 11 - వైసీపీకి
0 - టీడీపీకి దక్కాయి