అదిగదిగో కరోనా థర్డ్ వేవ్.. ఇవిగో సాక్ష్యాలు..?
ఎందుకంటే.. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు కరోనా కేసుల సంఖ్య మళ్లీ వేగంగా పెరుగుతోంది. ప్రపంచ దేశాల్లో కరోనా కొత్త కేసులు పెరుగుతుండటంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా తాజాగా ఆందోళనగా ఉంది. కేవలం వారం వ్యవధిలోనే ప్రపంచ వ్యాప్తంగా 11శాతం మేర కొవిడ్ కేసులు పెరిగాయని లెక్కలు చెబుతున్నాయి. ప్రపంచంలోని మొత్తం కరోనా కేసులపై ప్రపంచ ఆరోగ్య సంస్త ఈ వారంతపు నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం డిసెంబర్ 20నుంచి 26 మధ్య దాదాపు 50 లక్షల మంది కొత్తగా కరోనా బారినపడ్డారట. ఒక్క యూరప్‌లోనే 30 లక్షల వరకూ కొత్త కేసులు వచ్చాయని ఈ నివేదిక చెబుతోంది.
ఇక దేశాల వారీగా లెక్కలు చూస్తే.. కరోనా వృద్ధి రేటు అమెరికా చాలా మందు ఉందని ఈ నివేదిక చెబుతోంది. అమెరికాలో అక్టోబర్ నుంచి కేసుల పెరుగుల నమోదైంది. ప్రస్తుతం అమెరికాలో... 39శాతం మేర కేసులు పెరిగాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక చెబుతోంది. అదే సమయంలో అటు ఆఫ్రికాన్ ప్రాంతంలోనూ 7శాతం మేర కేసులు పెరిగాయట. ఆ కేసులది ఏముందిలే... ఎన్ని కేసులు వస్తే ఏంటి.. మరణాలు పెరగకుండా ఉంటే చాలాని కొందరు భావిస్తున్నారు.
కానీ.. విషాదం ఏంటంటే.. కరోనా మరణాల్లోనూ 4శాతం వృద్ధి రేటు నమోదు అయ్యిందట. గత వారం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 50 వేల మంది వరకూ ఈ కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారట. అందుకే ఈ లెక్కలు అన్నీ చూస్తే ప్రపంచాన్ని మరోసారి కరోనా వేవ్ భారీగానే కుదిపే ప్రమాదం కనిపిస్తోంది.