ఒమిక్రాన్‌ గురించి ఓ బ్రహ్మాండమైన గుడ్ న్యూస్..?

Chakravarthi Kalyan
ఒమిక్రాన్‌.. మరోసారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా వంటి దేశాలు ఇప్పడు ఒమిక్రాన్ విజృంభణతో హడలిపోతున్నాయి. ఫ్రాన్స్‌లో అయితే ఏకంగా ఒక్క రోజులో లక్ష కరోనా కేసులు వస్తున్నాయి. ఇండియాలోనూ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. త్వరలోనే ఈ కేసుల సంఖ్య వెయ్యికి చేరుకునే అవకాశం కనిపిస్తోంది. ఇదంతా ఎయిర్‌పోర్టుల్లో చేసిన టెస్టులు ఆధారంగా వస్తున్న సంఖ్యలే.. ఇక వాస్తవంగా చేస్తే ఇంకెన్ని కేసులు ఉంటాయో చెప్పలేం.

అయితే.. ఇలా ఒమిక్రాన్ హడలెత్తిస్తున్న సమయంలో దీని గురించి ఓ గుడ్‌ న్యూస్ కూడా వచ్చింది. అదేంటంటే.. కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ తొలిసారిగా వెలుగుచూసిన దక్షిణాఫ్రికాలో మాత్రం కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయట. గత వారం రోజుల్లో దక్షిణాఫ్రికాలో కొవిడ్ కేసుల సంఖ్య  బాగా తగ్గిందట. దాదాపు 40 శాతం వరకు కొత్త కేసుల్లో తగ్గుదల కనిపించినట్లు దక్షిణాఫ్రికా దేశం ప్రకటించింది. కేసులు క్రమంగా తగ్గుతుండటంతో దక్షిణాఫ్రికా దేశ అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

ఇలా దక్షిణాఫ్రికాలో కేసులు తగ్గడంతో .. డెల్టా వేరియంట్ క‌న్నా ఒమిక్రాన్ ప్రమాద‌క‌రం కాద‌ని నిపుణులు అంచనాకు వస్తున్నారు. దక్షిణాఫ్రికాలో వారం క్రితం 23 వేలు ఉన్న కేసుల సంఖ్య సోమ‌వారం నాటికి 15వేల‌కు ప‌డిపోయిందని అక్కడి అధికారులు చెబుతున్నారు. కేసులు తగ్గుతున్నా ఒమిక్రాన్ ప‌ట్ల మాత్రం అప్రమ‌త్తంగా ఉండాల‌ని నిపుణులు ప్రజలకు సలహా ఇస్తున్నారు. అంతే కాదు.. డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ మ‌ర‌ణాలు తక్కువగా నమోదయ్యాయట.

ఇటీవల ద‌క్షిణాఫ్రికాలో బీటా, డెల్టా వేరియంట్లు తీవ్ర ప్రభావం చూపించాయి. అయితే... ఆ సమయంలో దక్షిణాఫ్రికా వాసుల్లో రోగ నిరోధక శక్తి పెరిగి ఉంటుందని.. అందుకే ఒమిక్రాన్ వేరియంట్ వారిపై పెద్దగా ప్రభావం చూపకపోయి ఉండొచ్చన్న వాదన కూడా వినిపిస్తోంది. మరో కీలకమైన విషయం ఏంటంటే.. ఒమిక్రాన్‌తో  చ‌నిపోయిన‌వారిలో ఎక్కువ శాతం వ్యాక్సిన్ వేసుకోనివారే ఉన్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: