ఒమిక్రాన్ : గార్డెన్ సిటీలో కరోనా ముల్లులు!
పోలీసు మాత్రమే సంచరించే వీధి
ఎవ్వరయినా బయటకు వస్తే వద్దని
హెచ్చరికలు
హోటళ్ల నిర్వహణ గడువు కూడా తగ్గింపు
చిన్న చిన్న బడ్డీ కొట్లు కట్టేసి ఇంటికిపోవాల్సిన
అగత్యం .. అన్నీ మళ్లీ లాక్డౌన్ రోజులను
గుర్తుకు తెచ్చేవే.. రాత్రి పూట కర్ఫ్యూ ప్రభావితం
చేస్తే కరోనా కట్టడికి ఇదొక చిన్న చిట్కా కావొచ్చు
రాత్రి కర్ఫ్యూ విధింపుతో కాస్తయిన సమస్య ఒడ్డెక్కనుందన్న భావనతో రేపటి నుంచి కర్ణాటకలో సంబంధిత కట్టడి చర్యలు అమలు కానున్నాయి. రాత్రి పది గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకూ పౌరులెవ్వరూ బయటకు రాకుండా అత్యవసర సేవలు మినహా మిగిలిన వాటికి అనుమతించకుండా కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆ ప్రాంత ప్రజలు సంఘీ భావం ప్రకటించారు. కరోనా ఉద్ధృతిని కట్టడి చేసేందుకు పౌరులు కూడా ఇంకొంత బాధ్యతతో ఉంటే త్వరలోనే ఈ గండం నుంచి గట్టెక్క వచ్చన్న వాదన ఒకటి వైద్య రంగాల నుంచి వినిపిస్తోంది. బహిరంగ ప్రదేశాలు ముఖ్యంగా రద్దీ ఉన్న ప్రాంతాలు ఇక్కడ భౌతిక దూరం పాటింపు సాధ్యం కాకపోవడంతో వ్యాధి వ్యాప్తి తీవ్రం అవుతున్నందున మాస్క్ తప్పని సరి చేస్తూ కఠిన నిబంధనలు అమలు చేయాలని ప్రభుత్వాలను వైద్య రంగ నిపుణులు పదే పదే వేడుకుంటున్నారు.
బెంగళూరును గార్డెన్ సిటీ అంటారు. ఆ సిటీలో ఇప్పుడు కరోనా ఉద్ధృతి ఉంది. ఆ ఒక్క నగరమే కాదు చాలా ప్రాంతాలకు ఈ సమస్య ఉంది. ముఖ్యంగా కరోనా ఉద్ధృతి నివారణకు పౌర సమాజం కూడా ఓ కారణం. వారి బాధ్యతారాహిత్య ధోరణి కారణంగానే ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి. గ్రామాలలో కూడా అనుమానితులు వెంటవెంటనే పరీక్షలు చేయించుకోవడం లేదు. ఇప్పటికీ కొన్ని చోట్ల రెండో డోసు వ్యాక్సినేషన్ అన్నదే లేదు.
కరోనా ఉద్ధృతి తీవ్రంగా ఉన్నందున దక్షిణాది రాష్ట్రాలు అప్రమత్తం అవుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి కారణంగా దేశంలో అనూహ్యంగా కేసులు పెరిగిపోతున్నాయి. వ్యాధి తీవ్రత దృష్ట్యా ఎప్పటికప్పుడు రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నా, ఇంకా కొన్ని చోట్ల నిర్లక్ష్య ధోరణి మాత్రం సుస్పష్టంగా వెల్లడవుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కేంద్రం కూడా పదే పదే చెబుతోంది. వ్యాక్సినేషన్ ప్రాసెస్ కూడా వేగవంతం చేయాలని రాష్ట్రాలను ఆదేశిస్తోంది. అంతేకాదు బాధిత ప్రాంతాలను గుర్తించి వైద్య పరీక్షలను ముమ్మరం చేయడం, చికిత్స అందించడం వంటి పనులను కూడా ఎప్పటికప్పుడు చేయా లని కోరుతోంది. తాజాగా కర్ణాటక ప్రభుత్వం కూడా అప్రమత్తమయింది. నైట్ కర్ఫ్యూ విధింపునకు సమాయత్తం అయింది. బెంగళూరుతో పాటు చాలా ప్రాంతాలలో కరోనా విజృంభణ ఉన్నందున రాత్రి పూట ఈ నెల 28 నుంచి పది రోజుల పాటు కర్ఫ్యూ విధించాలని నిర్ణయించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై.