వివాదం : దివాలా దిశగా రాష్ట్రం? బీజేపీ బ్లాస్ట్
నిబంధనలకు ఎప్పుడో నీళ్లొద్దిలి ప్రభుత్వం ఆదాయార్జనకు తప్పుడు మార్గాలు వెతుకుతోందని కూడా ఏనాటి నుంచో ఉన్న విమర్శ.
రాష్ట్రంకు సరిపడినన్ని ఆర్థిక వనరులు ఉన్నా ప్రభుత్వాధినేత మాత్రం బేల చూపులు చూస్తున్నారని బీజేపీ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాన్ని దివాలా దిశగా నడిపిస్తున్నారని మరో ఆరోపణను కూడా జత చేసింది. వైసీపీ సర్కారు తీరుపై ఏనాటి నుంచో అసంతృప్తితో ఉన్న బీజేపీ నేతలు తాజాగా గొంతు సవరించుకుని మరికొన్ని అభియోగాలకు సిద్ధం అయ్యారు. అసలు రాష్ట్ర ప్రభుత్వం నడుచుకుంటున్న తీరుకు సంబంధించి ఎప్పటి నుంచో తనదైన వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూనే ఉంది. ఏడాదికేడాది అప్పుల భారం పెంచడం,ఎఫ్ ఆర్ బీఎం పరిమితి పెంచమని పదే పదే కేంద్రాన్ని కోరడం వంటివి బీజేపీకి నచ్చడం లేదు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు జీవీఎల్ లాంటి లీడర్లు, మాధవ్ (ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ) లాంటి యంగ్ స్టర్స్ స్పందిస్తున్నా జగన్ వైపు నుంచి వస్తున్న సమాధానాలు ఏవీ సంతృప్తికరంగా లేవు. దీంతో బీజేపీకి, వైసీపీకి మధ్య దూరం పెరుగుతుందే తప్ప సమస్యలు అయితే పరిష్కారానికి నోచుకోవడం లేదు.
ఈ నేపథ్యంలో విజయవాడ కేంద్రంగా ఈ నెల 28న ప్రజాగ్రహ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు బీజేపీ నాయకులు. అనాలోచిత నిర్ణయాల కారణంగా అప్పుల భారం ఆరు లక్షల కోట్లకు పైగా పెరిగిందని వాపోతూ, ప్రభుత్వ అసమర్థ విధానాలను, అపరిపక్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఈ సభను నిర్వహిస్తున్నామని ఎమ్మెల్సీ మాధవ్ చెబుతున్న మాట. ప్రభుత్వ తీరు బాగాలేనందున విద్యార్థులు, వ్యాపారులు, కాంట్రాక్టర్లు ఇలా అన్ని వర్గాలూ అవస్థలుపడుతూ పక్క రాష్ట్రాల వైపు చూపు మరలిస్తున్నారని, తమ బాగు కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లి అవకాశాలు వెతుక్కుంటున్నారని అంటున్నారీయన. అంతేకాదు సచివాలయాల ఏర్పాటు పేరుతో అటు 50 వేలకు పైగా మీ సేవా కేంద్రాలను, 30 వేలకు పైగా డిపోలను మూసివేయించిన ఘనత కూడా ఈ ప్రభుత్వానిదే అని గణాంకాలతో సహా విమర్శిస్తున్నారు.