మళ్లీ కోర్టు బోనులో జగన్?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఓ వైపు ఘనంగా జరుగుతుండగా, మరోవైపు సీబీఐ కోర్టులో ఆయన అక్రమాస్తుల కేసు విచారణ సాగింది. యాదృచ్ఛికమే అయినా కూడా ఈ కేసుకు సంబంధించి ఏళ్ల తరబడి సాగుతున్న విచారణ మరో అంకంకు చేరుకుంది. ఈసందర్భంగా ఆయన హాజరు విషయాన్ని కోర్టు మరోసారి ప్రశ్నించింది. ఇప్పటికే అనేక మార్లు కోర్టుకు రాకపోవడాన్ని తప్పు పట్టింది. దీనిపై న్యాయవాది (జగన్ తరఫు) చెప్పిన మాటలు విని మెమో దాఖలు చేయాలంది. మరోవైపు కోర్టుకు వచ్చే విషయమై హాజరు మినహాయింపు ఎప్పటి నుంచో జగన్ కోరుతూ వస్తున్నారు. ఇదే విషయమై అక్కడి (హైద్రాబాద్ కోర్టు) కోర్టును ఆశ్రయించి ఉన్నారని సంగతి తెలిసిందే! అయితే ఈ కేసు ఇంకా కొలిక్కిరావడం లేదు. విచారణ రీతి ఎలా ఉన్నా కూడా ఇప్పటికీ సీబీఐ సాక్ష్యుల సంగతి కానీ లేదా అక్రమాస్తుల సంగతి కానీ ఏదీ తేల్చలేకపోతోంది.
ఈ తరుణంలో జగన్ తాను ఇంతకాలం చెప్పదలుచుకున్న విషయాలన్నీ దాదాపుగా కోర్టుకు చెప్పేశారు. జైలు జీవితం కూడా గడిపి వచ్చేశారు. ఇక కేసు నమోదు చేసిన వారిలో టీడీపీ నేత ఎర్రన్న మన మధ్య లేరు. ఇప్పుడు టీడీపీ అక్రమాస్తుల కేసుపై పెద్దగా మాట్లాడడం లేదు. ఒకవేళ మాట్లాడినా కూడా ఏవో పాత ఆరోపణలు చేయడం తప్ప పెద్దగా సాధించిందేమీ లేదు. ఈ ఆర్థిక నేరం తరువాత జగన్ రాజకీయ ఎదుగుదల ఆగిందా అంటే అదీ లేదు. పోనీ ఆయన ఆర్థిక నేరాలు ముఖ్యమంత్రి హోదాలో చేయడం లేదా అంటే అదీ ఆగలేదు. స్టేట్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ పేరిట నిధుల బదిలీ అన్నది కూడా ఓ ఆర్థిక నేరమే! అదేవిధంగా వివిధ సంస్థల నిధులను ఒత్తిడి చేసి ఈ కార్పొరేషన్ కు మళ్లించడమూ ఆర్థిక నేరమే. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ సర్కారులో ప్రతి సంక్షేమ పథకం కూడా ఓ ఆర్థిక నేరమే వీటిపై కూడా మాట్లాడే దమ్ము.. న్యాయ పోరాటం చేసే సత్తా టీడీపీ దక్కించుకుంటే ఇంకా మేలు.