కేసీఆర్‌ తాతా.. చాలా థ్యాంక్స్.. మీరు సూపర్‌..?

Chakravarthi Kalyan
తెలంగాణలో కేసీఆర్ సర్కారు ఓ మంచి నిర్ణయం తీసుకుంది. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన దిశగా ఓ మంచి ఉత్తర్వులు ఇచ్చింది. 14 ఏళ్ల లోపు చిన్నారులతో ఎవరైనా సరే .. ఎక్కడైనా సరే  పని చేయించుకుంటే వారిపై ఇకపై కఠిన చర్యలు తీసుకుంటారు. చిన్న పిల్లలతో పని చేయించుకుంటే..  ఆర్నెళ్ల నుంచి ఏడాది జైలు శిక్ష విధిస్తారు. ఇంకా 20 వేల నుంచి యాభై వేల రూపాయల వరకు జరిమానా కూడా విధిస్తారు. ఇంకా షాకింగ్ ఏంటంటే.. ఒకవేళ చిన్నారులను సొంత తల్లిదండ్రులే పనికి పంపిస్తే.. చివరకి వారు కూడా శిక్షార్హులేనని కేసీఆర్ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.


బాగానే ఉంది. మరి కొందరు సొంత వ్యాపారులు, దుకాణాలు నడుపుకుంటారు. అలాంటి వాటిలో కూడా పిల్లలు పని చేయొద్దా అన్న అనుమానం రావచ్చు. అలాంటి వారికి చిన్న మినహాయింపు ఇచ్చారు.  చిన్నారులు తమ విద్యకు ఎలాంటి ఆటంకం కలగకుండా సొంత పనుల్లో తల్లి దండ్రులకు సహాయం చేయవచ్చు. ఇది నేరం కాదు.. అయితే.. అది కూడా హానికరమైన పనులు, ఆదాయం వచ్చేలా తయారీ రంగం, ఉత్పత్తి, రిటైల్ చైన్ సరఫరా పనుల్లో పిల్లలను పెట్టకూడదు. ఇలాంటివి సొంత పనులైనా పిల్లలను పనికి పెట్టకూడదన్నమాట.


అంతే కాదు. పాఠశాల సమయాలతో పాటు రాత్రి ఏడు నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు పిల్లలు పని చేయకూడదు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించడం కోసం ఇకపై ప్రతి జిల్లాలోనూ పర్యవేక్షణ కోసం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయాలి. అంతే కాకుండా ఏ చిన్నారి అయినా ఎలాంటి అనుమతి లేకుండా 30 రోజుల పాటు పాఠశాలకు గైర్హాజరు కాకూడదు. అలా అయితే.. ఆ విషయాన్ని నోడల్ అధికారి దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత సంబంధిత ప్రిన్సిపల్, ప్రధానోపాధ్యాయుడిదే అవుతుంది.

 

గతంలో కేంద్రం చేసిన చట్టానికి అనుగుణంలో తెలంగాణ రాష్ట్రంలో బాలకార్మిక చట్టాన్ని సవరిస్తూ ఈ  విధి విధానాలు ఖరారు చేశారు. ఈ మేరకు తెలంగాణ కార్మికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బావుంది కదా..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: