కేంద్రం కొత్త చట్టం.. ప్రేమికుల్లో మొదలైన కలవరం..

Deekshitha Reddy
టెన్త్ క్లాస్ లోనే లవ్, ఇంటర్లోనో, డిగ్రీలోనో 18 ఏళ్లు నిండగానే పెళ్లి. పోలీస్ స్టేషన్ కి పంచాయితీ చేరితే అమ్మాయి తాను మేజర్ ని అని అమ్మానాన్నలకు ఎదురు తిరుగుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో తల్లిదండ్రులు తల్లడిల్లిపోతారు. అయితే పెళ్లి తర్వాత అబ్బాయి అమ్మాయిని బాగా చూసుకుంటే పర్లేదు, కుటుంబాలు కలసిపోతాయి. కానీ మోసం చేసి పెళ్లి చేసుకుంటే మాత్రం అమ్మాయితోపాటు తల్లిదండ్రులకు కూడా నరకం కనపడుతుంది. ఇకపై ఇలాంటి ఘటనలకు ఫుల్ స్టాప్ పడే అవకాశముంది. కేంద్రం తీసుకొస్తున్న కొత్త చట్టంతో అమ్మాయిల వివాహ వయసు కూడా 21 సంవత్సరాలకు పెంచుతుండటంతో ఇలాంటి ప్రేమ మోసాలు ఇక వెలుగులోకి వచ్చే అవకాశాలు తక్కువ అంటున్నారు.
పరిణతి చెందిన ప్రేమ వ్యవహారాల్లో కచ్చితంగా అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ జీవితంలో స్థిరపడేవరకు ఆగుతారు. అంటే కచ్చితంగా వారిద్దరి వయసు 21 సంవత్సరాలు దాటుతుంది. అయితే అబ్బాయిలు అమ్మాయిల్ని ట్రాప్ చేేసే వ్యవహారాల్లోనే అమ్మాయిలు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకుంటారు. 18ఏళ్లు నిండీ నిండగానే పెళ్లి పీటలెక్కేస్తారు. అలా వారిపై ఒత్తిడి చేసి మోసం చేస్తుంటారు కొంతమంది. ఇలాంటి వ్యవహారాలన్నీ కేంద్రం తీసుకొచ్చే కొత్త చట్టంతో కాస్త తగ్గే అవకాశముంది.
ప్రస్తుతం పోలీస్ స్టేషన్లకు వచ్చే ప్రేమ పంచాయితీల్లో వివాహ వయసు తక్కువగా ఉండటంతో తల్లిదండ్రులకు నచ్చజెప్పలేకపోతున్నారు. అటు పిల్లలు కూడా టీనేజ్ లో ప్రేమ, పెళ్లి విషయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోలేరు. సరిగ్గా అదే వయసులో మోసపోతున్న అమ్మాయిల సంఖ్య ఎక్కువ. ఇప్పుడు వివాహ వయసుని 21కి పెంచడంతో ముందస్తు పెళ్లిళ్లకు అవకాశం ఉండదు. 18ఏళ్లకే మైనారిటీ తీరిందని వెంటనే పెళ్లికి సిద్ధమయ్యే ఛాన్స్ ఇక ఉండదు. దీంతో ఇలాంటి మోసాలు తగ్గిపోతాయని తెలుస్తోంది.
ఇప్పటికే చాలామంది బాల ప్రేమికులు 18ఏళ్లు దాటితే పెళ్లి చేసుకోడానికి సిద్ధమైపోయి ఉంటారు. అలాంటి వారందరికీ ఇది షాకింగ్ న్యూసేనని చెప్పాలి. మూడేళ్లు వేచి చూడటానికి దాదాపుగా చాలామందికి అవకాశం ఉండకపోవచ్చు. ఆ మూడేళ్ల వయసులో అమ్మాయిల ఆలోచనా ధోరణి విస్తృతం అవుతుంది. ప్రేమ పేరుతో జరిగే మోసాల్ని వారే స్వయంగా అర్థం చేసుకోగలరు. అందుకే వివాహ వయసుని 21 ఏళ్లకు పెంచుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: