కొత్త ఏడాది రాక మునుపే పండుటాకులకు పండుగ సంతోషం అందించాలన్న ఆలోచనతో యువ ముఖ్యమంత్రి పింఛను పెంపుపై తీసుకున్న నిర్ణయం పై అంతటా ఆనందాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం తన ప్రభుత్వానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో పెంపు మోయలేని భారం అయినా కూడా జగన్ మాత్రం అందుకు కూడా సిద్ధమేనని అంటున్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా వృద్ధాప్య పింఛన్లు అందించిన ఘనత తమదేనని పదే పదే చెబుతున్నారు. కరోనా కష్టం అన్నది లేకుంటే రెండు దశల్లో వ్యాధి వ్యాప్తి ఉద్ధృతి లేకుంటే ఇచ్చిన మాట ఈ పాటికే అమలయ్యేదని కూడా జగన్ వెల్లడి చేస్తున్నారు. ఈ క్రమంలో వచ్చే నెల 1 నుంచి పెరిగిన పింఛను అమల్లోకి రానుందన్న వార్త అందరిలోనూ ఓ విధంగా సంతోషకరమే! ఆలస్యం అయినప్పటికీ జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నది లబ్ధిదారుల మాట.
కష్ట నష్టాలకు ఓర్చి పాలన చేస్తున్న వైసీపీ సర్కారు తాజాగా పింఛను పెంపు నిర్ణయం తీసుకుని విపక్షాల నోళ్లు మూయించింది. యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన కొత్త సంవత్సర కానుక ఇదేనని వైసీపీ గర్వంగా చెప్పుకుంటోంది. తమది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని చెబుతోంది. తాజాగా వృద్ధాప్య పింఛనును రెండు వేల 500 కు పెంచి ఇంతటి ఆర్థిక సంక్షోభంలోనూ ముఖ్యమంత్రి సంబంధిత వర్గాల మేలు కోరి నిర్ణయం తీసుకున్నారన్న ప్రశంస సంబంధిత వర్గాల నుంచి వస్తోంది. వాస్తవానికి ఈ పెంపు ఎప్పుడో చేయాల్సింది కానీ కరోనా కారణంగా ఇప్పటిదాకా అర్హులయిన వృద్ధులకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇకపై నుంచి దక్కనుండడంతో ఆయా వర్గాలకు ఓ విధంగా ఇదొక ఊరట.
కొన్ని చోట్ల పింఛన్ల పంపిణీలో ఇబ్బందులు ఉన్నా, కొన్ని చోట్ల నిబంధనల సాకుతో పింఛన్ల పంపిణీ నిలిపివేసినా వీటన్నింటినీ ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలూ, ఎంపీలూ సవరించి కాస్తో కూస్తో పండుటాకులకు పండుగ సంతోషం అందిస్తున్నారు. అదేవిధంగా వలంటీర్లు కూడా ఎక్కడైనా తప్పిదాలు ఉంటే వెంటనే వాటిని సవరించేందుకు కృషి చేస్తున్నారు. పింఛన్ల పెంపుతో రాష్ట్ర ఖజానాకు భారం అయినప్పటికీ భరించేందుకు ఈ కష్ట కాలంలో ఇచ్చిన మాట నిలుపుకునేందుకు తమ ప్రభుత్వం సిద్ధమేనని ఎల్లవేళలా బాధిత వర్గాలకు అండగా ఉండడం తన బాధ్యత అని అంటున్నారు సీఎం.