సినిమా థియేటర్ లకు సంబంధించి అక్కడ అమ్ముడవుతున్న టికెట్ రేట్లకు సంబంధించి ఎప్పటి నుంచో రగులుతున్న వివాదం ఓ కొలిక్కి వచ్చింది. టికెట్ ధరలు తగ్గిస్తూ, వాటి అమ్మకాలపై నియంత్రణ వ్యవస్థ ఏర్పాటుచేస్తూ ఏపీ సర్కారు తీసుకు వచ్చిన జీఓను హైకోర్టు కొట్టేసింది. పాత విధానాన్ని అనుసరించి టికెట్ రేట్లు పెంచుకునే అవకాశాన్ని డిస్ట్రిబ్యూటర్లకు ఇస్తూ తన నిర్ణయా న్ని వెలువరించింది. దీంతో జగన్ అండ్ కో ఖంగుతింది.
ఇప్పటికే పలు మార్లు అతి తక్కువకే వినోదం అందించేందుకే టికెట్ రేట్లపై నియంత్రణ అన్నది విధించామని పదే పదే చెప్పిన జగన్ తాజా నిర్ణయంతో ఏమయిపోతారో! ఈ నిర్ణయ ప్రభావం త్వరలో విడుదల కానున్న పుష్ప, ఆర్ఆర్ఆర్, ఆచార్య, భీమ్లా నాయక్ తో సహా మరికొన్ని చిత్రాలపైనా పడనుంది. దీంతో ఆయా వర్గాలు ఆనందాతిరేకా లు వ్యక్తం చేస్తున్నాయి. వాస్తవానికి పవన్ కల్యాణ్ అనే నాయకుడిని నిలువరించేందుకు జగన్ తీసుకున్న నిర్ణయం ఇది అని ఎప్పటి నుంచో వినిపిస్తున్న వాదన. ఈ నిర్ణయం కారణంగానే వకీల్ సాబ్ కు అనుకున్నంతగా లాభాలు రాలేదు.
ఆశించిన వసూళ్లు లేక నిర్మాత ఆర్థికంగా కొంత నష్టపోయిన మాట వాస్తవమే! తదనంతర పరిణామాల నేపథ్యంలో పవన్ కూడా తన పై కోపం ఉంటే నేరుగా ప్రజా క్షేత్రం లో తేల్చుకోవాలే కానీ ఈ విధంగా తన నిర్మాతలను, ఎగ్జిబిటర్లను, బయ్యర్లను టార్గెట్ చేస్తూ వారి పొట్ట కొట్టడం భావ్యంగా లేదని రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ తీవ్రంగా స్పందించి పెను వివాదాలకు తావిచ్చారు. ఈ ఈవెంట్ అయ్యాక కూడా దిల్ రాజు తో సహా పలువురు టాలీవుడ్ పెద్దలు మంత్రి పేర్నినానితో చర్చలకు హైద్రాబాద్ నుంచి విజయవాడకు వచ్చి ఆయనను కలిసి వెళ్లారు. కానీ ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. టిక్కెట్లు అమ్ముకునేందుకు తాము ప్రత్యేకంగా ఒక పోర్టల్ తీసుకువస్తామని పేర్నినాని చెప్పినప్పటికీ సంబంధిత చర్యలు కూడా ఇంకా తుది రూపు దాల్చలేదు. వివాదం నడుస్తుండగానే అఖండ సినిమా విడుదలైన మంచి వసూళ్లు దక్కించుకుంది. అయినా కూడా జగన్ తన నిర్ణయంలో మార్పే లేదని చెప్పేశారు. ఈ నేపథ్యంలో తాజా నిర్ణయం ఓ విధంగా ఇండస్ట్రీకి ఓ కొత్త ఊపిరి.