ఎమ్మెల్సీ కౌంటింగ్ : విధేయులంతా క్షేమమేనా!
తెలంగాణ వాకిట ప్రత్యేక రాజకీయం రాజ్యమేలుతోంది. అందుకు కేసీఆర్ అనే శక్తి ముందుండి నడుపుతోంది. ఆ విధంగానో ఏ విధంగానో తెలంగాణలో విధేయులందరికీ పదవులు దక్కుతూనే ఉన్నాయి. వివిధ మీడియా ఛానెళ్లలో పార్టీ తరఫున గొంతుక వినిపించిన వారికి అదేవిధంగా పార్టీ తరఫున చేపట్టే పనులు క్రమం తప్పక చేసేవారికి ఈ సారి అనగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంచి ప్రాధాన్యమే దక్కింది. ఫలితంగా ఆరుకు ఆరు స్థానాలూ కేసీఆర్ మనుషులే గెలుచుకుని విజయబావుటా ఎగురవేశారు.
తమ అధినాయకత్వం అప్పగించిన బాధ్యతలు క్రమం తప్పక ఇకపై కూడా నిర్వర్తిస్తామని, పార్టీ కీ పెద్దల సభకూ అనుసంధానకర్త లుగా ఉంటానమి చెబుతున్నారు వీరు. తాజాగా గెలుపు సాధించిన వారిలో ఎల్.రమణ, తాతా మధు, ఎంసీ కోటిరెడ్డి, భాను ప్రసాద్, దండె విఠల్, యాదవ్ రెడ్డి ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి హుజురాబాద్ ఎన్నికల సమయంలోనే పార్టీ తీర్థం పుచ్చుకున్న ఎల్ రమణ అనూహ్యంగానే ఎమ్మెల్సీ అయ్యారు. ఇదే సమయంలో గవర్నర్ కోటాలో రికమెండ్ అయిన కౌశిక్ రెడ్డి మాత్రం ఇప్పటికీ ఎమ్మెల్సీ కాలేకపోయినారు. ఆయన కన్నా వెనుక వచ్చిన ఎల్ రమణ దర్జాగా అనుకున్నది సాధించి గులాబీ దండులో తన స్థానం ఏంటో చెప్పకనే చెప్పారు అని ఆయన అభిమానులు చెబుతున్న మాట.