గులాబీ ముల్లు : మళ్లీ రాజీ డ్రామా!
రాజీనామాలు శీతాకాలం వేళ ఇచ్చేద్దాం అని బయలుదేరిపోతున్నారు తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన ఎంపీలు..వీళ్లంతా పెద్దల సభకు అదేలేండి రాజ్యసభకు చెందిన సభ్యులు. కేసీఆర్ ఆదేశానుసారం రైతు బాగు కోరి సాగు బాగు మరీ మరీ కోరి కేసీఆర్ కోరిక మేరకు త్వరలో రాజీనామాలు చేసి కేంద్రానికి తమ తడాఖా చూపనున్నారు అన్నది ఇప్పుడు వస్తున్న వార్తల సారాంశం. అలా అని శీతాకాలంలో ఈ వేడి గాలలు ఏంటని ప్రశ్నించకండి..వేడీ లేదు చల్లా లేదు ఏదో ఒక ఊసు ఉండాలి కదా! అందుకని పెద్దసారు నడిపిస్తున్న డ్రామా ఇది అని షురూ చేస్కోండ్రి!
ఉద్యమ కాలంలో రాజీనామాల పర్వంతో హుషారెత్తించిన కేసీఆర్ మళ్లీ అదే పంథాలో రాబోతున్నారు. నడవబోతున్నారు కూడా! అవును! ఆయనకు బాగా కలిసివచ్చిన సూత్రాలను (ఫార్మాలా బేస్డ్ పొలిటిక్స్) పాటిస్తూ రాజకీయం చేసేందుకు ఇష్టపడుతున్నా రు కూడా! తెలంగాణ వాకిట కేసీఆర్ కు ఇప్పటికిప్పుడు వచ్చిన కష్టమేమీ లేకపోయినా బీజేపీ ఎదుగుదల ఎందుకో ఆయనకు నచ్చడం లేదు. అందుకనో ఎందుకనో ఆయన యాసంగి వడ్లు కొనుగోలు చేయని కేంద్రంపై కస్సుబుస్సులాడుతున్నారు. ఓవిధంగా కేసీఆర్ ను పెద్దవాణ్ని చేసిందే బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీల ద్వయం. ఆ ద్వయం పాటింపజేసిన ద్వంద్వ నీతి కారణంగానే ఆ యన ఇంతటి వారయ్యారు.
ఎంత కాదన్నా వీరు వీరయ్యారు వీరు వారయ్యారు అనే విధంగా తెలంగాణ వాకిట కాంగ్రెస్ మరియు బీజేపీ స్థితీగతీ అతీగతీలేకుండా పోతోంది. ఒకనాడు కేసీఆర్ ఎదుగుదలకు కారణం అయిన ఆ రెండు జాతీయ పార్టీలనూ కేసీఆర్ ఓ విధంగా నామ రూపాల్లేకుండా తిరిగి లేవకుండా చావు దెబ్బ కొట్టాలని రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రయత్నించారు. ఆవిధంగా సక్సెస్ అయ్యారు కూడా! అయితే ఇప్పుడిప్పుడే గులాబీ దండులో ఓ ముసలం బయలుదేరనుంది. అదేంటంటే రేపటి వేళ కేసీఆర్ టికెట్ ఇవ్వను పొమ్మన్న నేతలంతా బీజేపీ గూటికి చేరిపోతారు.
గతంలో మాదిరిగా సెల్ఫ్ ఇమేజ్ లేదా స్టార్ డమ్ ఉన్న నేతలంతా కిషన్ రెడ్డి కారణంతోనో లేదా ఈటెల దయతోనో చేరిపోయి తమ పబ్బం గడుపుకుంటారు. ఆపాటి అవకాశం కానీ ఆలోచన కానీ తన దగ్గర ఉన్న నాయకులకు ఎందుకు ఇవ్వడం అని ఇప్పటి నుంచే కేసీఆర్ చాలా అంటే చాలా జాగ్రత్త పడుతూ రాజకీయం చేస్తున్నారు.ఇదంతా కేసీఆర్ ముందస్తు వ్యూహం మరియు ముందు జాగ్రత్త కూడా! ఈ పందెంలో మొన్నటి వేళ హుజురాబాద్ నుంచి ఈటెల, దుబ్బాక నుంచి రఘునందన్ గెలిచారు. ఎంత కాదన్నా డీఎస్ కొడుకు ధర్మపురి అరవింద్ నిజామాబాద్ వాకిట కవితక్కను ఢీకొని తన సత్తా చాటి ఇప్పుడు కేసీఆర్ ను తిట్టరాని తిట్లు తిడుతున్నారు. వాళ్ల నాన్న టీఆర్ఎస్ గూటి నుంచి రాజ్యసభకు ఎంపిక అయిన ఎంపీ అన్న విషయమే మరిచిపోయి మరీ ! తిట్లు తిడుతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ తనదైన వ్యూహ రచనలో భాగంగా కొత్త స్కీం కు స్కెచ్ వేసి తొందర్లోనే తమ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులతో రాజీనామాలు చేయించి బీజేపీని ఇరకాటంలో పెట్టాలన్నది ఓ వ్యూహం. దీనివల్ల ఒరిగేదేమీ ఉండకపోయినా ఏదో డ్రామా నడపాలి గనుక నడపడం.. అంతకుమించి కేసీఆర్ సాధించేదేమీ లేదు అన్నది సుస్పష్టం.